జ్ఞాన సిద్ధాంతం

* స్మ్రుతి *

మానవులు ఏదైనా విషయాన్ని పదే పదే స్మరిస్తే వారికి అది చిరకాలం గుర్తుండిపోతుంది. ఉదాహరణకి చిన్నప్పుడు పిల్లలు అందరూ ఎక్కాలు భట్టీ పడతారు. కళ్ళు మూసుకుని 2 X 1 = 2 దగ్గర మొదలుపెట్టి 10 X 10 = 100 దాకా భట్టీ పట్టేస్తారు. కొంతమంది పిల్లలు అయితే 20 X 20 = 400 వరకూ భట్టీ పట్టేస్తారు. అవి వారికి జీవితాంతం గుర్తుండిపోతాయి. పూర్వ కాలంలో పిల్లలతో అమరకోశం ఇలాగే భట్టీ పట్టించేవారు. తద్వారా సంస్కృత వాఙ్మయంలో వచ్చే పదాలన్నీ వారికి చిరకాలం గుర్తుండిపోయేవి. బ్రహ్మచర్యంలో ఉన్నత విద్యలు అభ్యసించే సమయంలో అవసరమయ్యే జ్ఞాన పునాదులు బాల్యంలోనే సముపార్జించిపెట్టే ప్రక్రియ - ఈ భట్టీ పట్టడం. 

ఏదైనా విషయం గుర్తుండాలంటే అది పురాణంలో నిల్వ చేసి ఉండాలి. అవసరమైనప్పుడు అది అక్కడినుండి బయటకు రావాలి. విషయాలని స్మరిస్తున్నపుడు అవి స్మృతిని చేరుతాయి. అప్పుడు స్మృతి ఫలానా సమయంలో, ఫలానా ప్రదేశంలో ఈ విషయం స్మరించబడింది అని దాని విషయ సూచికలో భద్రపరచుకుంటుంది. వెంటనే వాటిని పురాణానికి పంపించి అక్కడ నిల్వ చేస్తుంది. అవి చెవిద్వారా వచ్చిన ధ్వని తరంగాలు అవ్వచ్చు, ముక్కు ద్వారా వచ్చే వాసనలు కావచ్చు, కంటి ద్వారా వచ్చే చిత్రములు కావచ్చు, మనసు ద్వారా వచ్చే ఊహలు కావచ్చు, భావములు కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు. జరిగినది జరిగిన వెంటనే దేశకాలానుగుణంగా స్మ్రుతి యొక్క విషాసూచికలో భద్రమవుతుంది. విషయం యొక్క పూర్తి వివరం పురాణంలో నిల్వ అవుతుంది. గమనించవలసినది ఏమిటంటే స్మృతి కేవలం  విషయాల యొక్క సూచిక మాత్రమే, అసలు విషయం పురాణంలో నిల్వ చేయబడుతుంది. ఉత్తరోత్రా అదే విషయం మళ్ళీ జరిగినప్పుడు స్మ్రుతి తన విషయం సూచికను పరికించి, తద్వారా అది ఇంతకుముందు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది తెలుకుని, పురాణం నుండి పూర్తి వివరాన్ని శోధించి విలికితీసి ఇస్తుంది. 
* స్మ్రుతి - కాలచక్రం *

స్మ్రుతి గురించి పూర్తి అవగాహన కలగాలంటే కాలచక్రం గురించి చర్చించుకోవాలి. ఎందుకంటే అది చేసే ప్రతీది కాలచక్రంతో ముడి పడి ఉంటుంది. కాలచక్రం మనందరిలోనూ ఉంటుంది. దీనితోనే జీవనం మొదలవుతుంది. తుట్టతుదలో ఇది ఆగిపోయాకే ప్రాణం శరీరాన్ని విడిచి పోతుంది. నిజానికి సమయమెంతయ్యిందో తెలుసుకోవడానికి మనుషులు గడియారం చూడవలసిన అవసరం లేదు. తమలోని కాలచక్రం ద్వారా తెలుసుకోవచ్చు. సమయానుగుణంగా మనుషులకు ఆకలి వేసి నిద్ర వస్తోంది అంటే అది ఈ కాల చక్రం వలెనే సాధ్యం. పొరుగు దేశాలకు వెళ్ళినపుడు అనుభవించే జెట్లాగ్ ఈ కాల చక్రం వలెనే వస్తుంది. మనిషికి దేశ కాలాలు అనుక్షణం తన స్మృతిలో ఉంటాయి. ఆహారం తినే సమయమయ్యింది అని మొదట స్మృతికి తెలుస్తుంది. అప్పుడది జఠరాగ్నిని సృష్టించమని జీర్ణకోశానికి సంకేతం పంపుతుంది. నిద్రించే సమయం ఆసన్నమయిందని స్మృతికి తెలిసినపుడు అది ఆవలింతలు కలుగజేసి శరీరాన్ని మెల్లగా నిద్రావస్థలోకి తీసుకువెళ్తుంది. కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా విద్యాభ్యాసం చేయాలన్నా, కొలువులో పని చేయాలన్నా వేరే ఏమి చేయాలన్నా సమయానుగుణంగా ఆయా పనులకు కావలిసిన శరీరాంశాలను చేతనం చేసి తద్వారా మనుషులు గొప్పగా రాణించడానికి తోడ్పడుతుంది స్మ్రుతి. పొరుగుదేశాలకు (ఉదా: భారత దేశం నుండి అమెరికా) వెళ్ళినప్పుడు స్మృతిలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ కర్మలన్నీ అక్కడ కాలమానం ప్రకారం జరుగుతుంటాయి. కానీ స్మ్రుతి ఇంకా స్వదేశపు కాలమానానికే అలవాటుపడి ఉంటుంది. గమనించ వలసిన ముఖ్యమైన విశేషమేమిటంటే కాలచక్రంలో మార్పు ఉండదు. ఏ దేశానికి వెళ్లిన అది ఒకే లాగ తిరుగుతుంది. అందుకని పొరుగుదేశ కార్యకలాపాలతో సమన్వయం పొందాలంటే స్మ్రుతి తన అలవాటులను మార్చుకోవాలి. ఉదాహరణకు భారత దేశంనుండి అమెరికా వెళ్ళారనుకోండి, ఇంతకుముందు రాత్రి భోజనం చేయవలసిన సమయంలో కాలకృత్యాలు తీర్చుకుని ఫలహారం తినాలనే సంకేతం పంపించాలి. ఇంతకుముందు ఆవలింతలతో నిద్రావస్థలోకి జారుకునే సమయంలో మెదడుకు కొలువు చేయమని, లేదా విద్యాభ్యాసం చేయమని సంకేతం పంపించాలి. ఎందుకంటే అమెరికా కాలమానం ప్రకారం అక్కడ ఆ సమయంలో ఆయా కర్మలు జరుగుతుంటాయి. విమానం ఎక్కి వెళ్లేవారికి ఒక్క రాత్రిలో కాలమానం మారిపోతుంది. అంత త్వరగా స్మృతి తన అలవాటుని మార్చుకోలేదు. కనుక కొంత అయోమయానికి గురవుతుంది. ఫలితంగా నిద్రలేమి, కడుపులో వికారం, అలసత్వం మొదలైనవి వస్తాయి. సూర్య రశ్మిని చూస్తూ తరచుగా నీళ్లు తాగుతుంటే క్రమేపి స్మ్రుతి తన అలవాటులను అమెరికా కాలమానానికి అనుగుణంగా మార్చుకుంటుంది. అంటే స్మృతి మన అవసరాలను బట్టి తన అలవాటులను మార్చుకుని తద్వారా మనుషులు మరింత గొప్పగా రాణించేలా ఉపయోగపడుతుంది. 
గమనిక - కాలమంటే సమయకాశాల మిశ్రమము. సమయం గడిచింది అంటే ఆకాశం(ప్రదేశం)  ఉన్నట్లు. ఆకాశం ఉంది అంటే సమయం గడుస్తునట్లు. సమయం లేని ఆకాశాన్ని, ఆకాశం లేని సమయాన్ని హేతుబద్ధంగా ఊహించడం కుదరదు. 

రోజులో గడిచే సంఘటలన్నీ స్మ్రుతి తన కాలమానంలో భద్రపరుస్తుంది. భూతకాలపు స్మ్రుతి అందువలనే సాధ్యమవుతుంది. ఫలానా సంఘటన ఎప్పుడు జరిగింది అని అడిగితే సుమారుగా ఈ సమయంలో ఈ ప్రదేశంలో జరిగింది అని చెప్పగలిగే సామర్ధ్యం దీని నుండే వస్తుంది. 

* పురాణం *

సంస్కృత భాషలో పురాణ అనే శబ్దానికి "జరిగిన దాని గూర్చి చెప్పునది" అని అర్ధం వస్తుంది. భౌతికంగా ఊహించుకోవాలంటే పురాణం ఒక పెద్ద చేపల వల వలే ఉంటుంది. రెండు దారాలు కలిసిన చోటుని మూల అంటారు. అక్కడ విషయం నిక్షిప్తమై ఉంటుంది. రెండు విషయాల (మూలల) మధ్యలో ఒక దారం ఉంటుంది అందులో ఆ రెండింటికీ ఉన్న సంబంధం నిక్షిప్తమై ఉంటుంది. దాని ఊహా చిత్రం ఈ క్రింది రేఖా చిత్రం మాదిరిగా ఉంటుంది. 

విషయం వృత్తాలలో ఇమడ్చబడుతుంది. ఆ వృత్తాల మధ్య ఉన్న రేఖలు వాటి మధ్యగల సంబంధాన్ని తెలుపుతాయి.  వృత్తాలు రేఖలు సమిష్టిగా మొత్తం సమాచారాన్ని పొందుపరుస్తాయి. పైన రేఖా చిత్రంలో పిల్లుల గురించిన సమాచారం పురాణంలో ఎలా పొందుపరచబడుతుందో ఊహించి ప్రదర్శించాము. 

పురాణంలో పరస్పర సంబంధంగల వృత్తాలు అన్నీ ఒక చోట చేర్చబడతాయి. ఏ సంబంధమూ లేని విషయాలు దూరంగా నిల్వ చేయ బడతాయి. అంటే పురాణం అనేక వృత్తాల గుంపులాగ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క విషయాంశానికి ఒక్కొక్క వృత్త సమూహం ఉంటుంది. ఉదాహరణకి ఉద్యోగ విషయాలకి సంబంధించి ఒక సమూహము, వ్యక్తిగత వ్యవహారాలకు ఒక సమూహము, ఊళ్ళో ఉన్న వివిధ ప్రదేశాలు, వాటి దూరాలు, త్రోవలు మరొక సమూహము, పాఠ్యాంశాలతో మొరొక సమూహము ఇలాగ ఒక్కొక్క సమూహములోనూ పరస్పర సంబంధం కల అనేక విషయాలు వృత్తాలుగా వాటి మధ్య బంధాలు రేఖలుగా ఏర్పడతాయి.  ఏదైనా అంశం గురించి అనేక విషయాలు తెలుసునే ప్రయత్నం చేస్తే, ఉదాహరణకి క్రికెట్ ఆటపై అభిమానంతో దానిపై చాలా ఎక్కువ సమాచారం సేకరించారనుకోండి, అప్పుడు అవన్నీ పురాణంలో ఒక వృత్త సమూహంలా ఏర్పడతాయి. ఉదాహరణకి ఈ క్రింది రేఖా చిత్రంలో నీలి రంగులో ఉన్న వృత్తాలన్నీ స్థలముల గురించి తెలుపుతున్నాయి, బీజ్ రంగులో ఉన్న వృత్తాలన్నీ మానవ సంబంధాలను తెలుపుతాయి. ఇలా సమాచారం మొత్తం అనేక సమూహాలుగా పురాణంలో నిక్షిప్తమవుతుంది. 

స్మ్రుతి - స్మరణ - పురాణం

ఏదైనా ఒక విషయం పురాణంలో వ్రాయబడాలంటే మొదట స్మ్రుతి దానిని స్మరించాలి. స్మరణ ద్వారానే స్మృతి పురాణానికి విషయాన్ని చేరవేస్తుంది. అప్పుడు పురాణం దానిని వృత్తాలు, రేఖలుగా విభజించి దానిలో నిక్షిప్తం చేసుకుంటుంది. మన తెలుగు భాషలో ఒక సామెత ఉంది. ఉపాధ్యాయులు పాఠాలు  బోధించే సమయంలో తరచూ ఈ నానుడి వాడుతుంటారు. "నేను చెప్పేది అర్ధం అవుతోందా లేక ఈ చెవిని విని ఆ చెవులోంచి బయటకు పోతోందా" అని. ఆ నానుడి వెనుక మర్మం ఇదే. చెప్పే విషయం దృష్టి పెట్టి స్మ్రుతి ద్వారా అది పురాణంలోకి వెళుతోందా లేదా అని దాని భావమన్నమాట. 

డేజా వు - డెజా వు ఒక భ్రమ. ఇది మనుషులందరికీ అప్పుడప్పుడు కలుగుతుంది. ఒక్కొక్క సారి జరుగుతున్న సంఘటన ఇంతకుముందు కూడా జరిగినదా అనే భ్రమ కలుగుతుంది. దానినే డేజా వు అని అంటారు. సాధారణంగా ఇది చాలా స్వల్ప కాలం ఉంటుంది. మన పురాణంలో అనేక వృత్త సమూహాలు  ఉంటాయి. ఒక్కొక్క మరు,  స్మ్రుతి ఒకే విషయాన్ని పలుచోట్ల (వృత్త సమూహాలు) పొందుపరచవలసి వస్తుంది. ఆలా చేస్తున్నపుడు ముందుగా ఒక చోట రాసి తరువాత మళ్ళీ అదే విషయాన్ని మరొక చోట రాసే తరుణంలో మనకు డేజావు అనే భ్రమ కలుగుతుంది. 

* స్మ్రుతి - జాగృత్ - స్వప్న - సుషుప్తి *

స్మ్రుతి జాగృదావస్థలో చేతనంగా ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. జ్ఞాన సముపార్జనలో పాల్గొంటుంది. బుద్ధి ఇచ్చే ఆదేశాలను అనుసరించి అవయములతో పని చేయిస్తుంది. భావములు రేకెత్తిస్తుంది. జరుగుతున్నవన్నీ తన విషయసూచికలో భద్రపరుస్తుంది. కర్మలు చేస్తుండగా నేర్చుకున్న కొత్త జ్ఞానాన్ని మళ్ళీ పురాణంలో భద్ర పరుస్తుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం పురాణం నుంచి స్మృతిలోకి వస్తుంది. అప్పుడు స్మ్రుతి దానిని విశ్లేషించి చివరిగా నిర్ణయం కోసం శృతిని సంప్రదిస్తుంది. శృతి ఇచ్చిన నిర్ణయాత్మక సందేశాన్ని అనుసరించి కార్యనిర్వాహణ సాగిస్తుంది. 

సుషుప్తి అంటే గాఢ నిద్ర. శరీరం ఈ అవస్థలో ఉన్నపుడు స్మ్రుతి అచేతనంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో జరిగిన విషయాల గురించి మనకు ఏమీ తెలియదు. దీనినే మనము సోయ లేకుండా ఉండడం అని అంటాము. జ్ఞానమునకు సంబంధించిన ఏ అంశము ఈ అవస్థలో పని చేయదు. శృతి, స్మ్రుతి, పురాణం, చిత్ అన్నీ అచేతనంగానే ఉంటాయి. అందుకే ఈ అవస్థలో జ్ఞానం శూన్యం. 

స్వప్నావస్థ జాగృత్ కి సుషుప్తికి మధ్యలో ఉంటుంది. ఇదీ నిద్రావస్థే కానీ ఇందులో అంత గాఢమైన నిద్ర ఉండదు.  శృతి యొక్క నిర్ణయాత్మక శక్తి ఉండదు. అందుకే ఇక్కడ జరిగే సంఘటనలలో హేతువు ఉండదు. అంతా లీలగా జరుగుతుంటుంది. సాధారణముగా చిత్తములో ఉన్న విషయాలే స్వప్నావస్థలో స్మృతిలోకి వస్తాయి. ఈ అవస్థలో స్మ్రుతి కాలచక్రానికి అనుసంధానమై ఉండదు. చిత్తమునుండి విషయం స్మృతిలోకి వచ్చింది కనుక స్వప్నం వచ్చింది అని గుర్తుంటుంది. కానీ కాల చక్రంతో అనుసంధానం లేదు కనుక అది ఏ సమయంలో వచ్చిందో, ఎంత గడువులో ముగిసిందో చెప్పడం కుదరదు. 

* శృతి * 

శృతి పని రంధ్రాన్వేషణ చేయడం. భగవత్సృష్టిలోని అత్యద్భుతమైన విషయం ఈ శృతి. కేవలం నరులు వానరులు మాత్రమే ఈ రంధ్రాన్వేషణ చేయగలరు. రెండు చిన్న కథలతో ఈ రంధ్రాన్వేషణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. 

కథ1 - ఒక రైతు అంగట్లో ఒక చిన్న మామిడి మొక్కను కొనుక్కున్నాడు. ఇంటికి తీసుకువెళ్లి తన పెరట్లో దానిని నాటాడు. దానికి అవసరమైన ఎరువు, నీరు అవసరానుగుణంగా అందిస్తూ ఉన్నాడు. ఫలితంగా అది ఏపుగా ఎదిగి మూడేళ్ళలోనే కాపు కాసింది. చాలా రుచికరమైన పండ్లు ఇచ్చింది. బావుంది కదా అని అలాంటి నారే ఇంకొకటి తెచ్చి దాని పక్కనే 4 అడుగుల దూరంలో నాటాడు. మొదటి చెట్టు మాదిరిగానే దీనికి కూడా అవసరార్ధం నీరు, ఎరువు అందించాడు. ఈ రెండు చెట్లకు వయసులో సుమారు 3.5 ఏళ్ళు వ్యత్యాసం ఉన్నది. దాని కారణంగా మొదటి చెట్టు మంచి కాపు కాస్తున్నప్పటికీ రెండవది ఇంకా చిన్న మొక్కవలె ఎదుగుతూ ఉన్నది. దానికి ఇంకా కాపు రాలేదు. రైతు మొదటి చెట్టు పళ్ళు కోసుకుని చాలా సంతోషించేవాడు. రెండవ చెట్టుకు నీరు, ఎరువు అందిస్తూ ఉండేవాడు. అది చూసి ఆ మొదటి చెట్టు నేను ఎంతో గొప్ప కాబట్టే రైతు నా వల్ల సంతోషంగా ఉన్నాడు. ఈ పక్క చెట్టు నా అంత గొప్ప కాదు. అందుకే దాని వలన అతనికి శ్రమ తప్ప సంతోషమేమీ లేదు అని భ్రమ పడసాగింది. రోజూ నేను దీని కన్నా పెద్దగా ఉన్నాను, ఎంతో పచ్చగా ఉన్నాను, ఎన్నో పళ్ళు ఇస్తున్నాను, రైతు ఎప్పుడు నన్నే మెచ్చుకుంటాడు అని గర్వంతో బడాయికి పోయేది. ఆ గర్వంతో రెండవ చెట్టు ఎం ఆలోచిస్తోంది, ఏం భావిస్తోంది అనే విషయం ఎప్పుడు పట్టించుకోలేదు. అలా మూడేళ్లు గడిచాయి. రెండవ చెట్టు కూడా కాపుకు వచ్చేసింది. మంచి పళ్ళు ఇవ్వడం మొదలుపెట్టింది. అది చూసి రైతు చాలా సంతోషించాడు. రెండవ చెట్టు పళ్ళు తిని ఎంతో రుచిగా ఉన్నాయని పరమ సంతోషపడిపోయాడు. అది చూసి మొదటి చెట్టు ఖంగుతింది. అదేమిటి, నేను కదా గొప్ప, నా వలన కదా రైతు సంతోష పడాలి, ఈ పక్క చెట్టును చూసి సంతోషిస్తున్నాడేంటి అని నివ్వెరపోయింది. ఇలా కొన్నాళ్ళు గడిచింది. రెండవ చెట్టుకూడా తనతో సమానంగా రైతుకు ఉపయోగపడటం చూసి అది జీర్ణించుకోలేక మొదటి చెట్టు తనలో తాను సతమతమవుతోంది. అప్పుడే మొదటి చెట్టుకు తెగులు పట్టింది. ఆకులన్నీ నల్లగా మాడిపోయి, పండు ముగ్గుకుండానే చెట్టునుండి రాలి పోవటం మొదలైంది. అది చూసి రైతు మొదటి చెట్టుపై వేప పొడి, పంచగవ్యం వంటి కీటక నాశినులను చల్లేవాడు. రెండవ చెట్టుకు ఏ తెగులూ రాలేదు. అందుకు దాని పళ్ళు తీసుకుని సంతోషంగా వెళ్లే వాడు. ఇప్పుడు మొదటి చెట్టు వలన రైతుకు శ్రమ, రెండవ చెట్టు వలన రైతుకు సంతోషం కలుగుతున్నాయి. కొంతకాలానికి మొదటి చెట్టుకు తెగులు పోయింది. అప్పుడు రెండు చెట్లూ సమానంగా పళ్ళు ఇవ్వసాగాయి. రైతు రెండింటివలనా సమానమైన సంతోషం పొందేవాడు. 

కథ2 - ఒక మాస్టారు గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దవాడు ప్రతాప్ ప్రదీప్ కన్నా రెండేళ్లు పెద్ద. మాస్టారు ఇద్దరి కొడుకులనీ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. వారికి కావలసిన, పోషణ, పాలన, మార్గదర్శకత్వం అందిస్తూ ఉండేవారు. ఆయన ఎవరినీ ఎన్నడూ ఎక్కువగా లేదా తక్కువగా చూడలేదు. వయసులో పెద్ద అవడం వలన ప్రతాప్ ఆటపాటలలోను, పోటీలలోను ప్రదీప్ కన్నా ముందు ఉండేవాడు. ఒక్కొక్క సారి మాస్టారు ఖాలీ లేకపోతే ప్రదీప్ ను సందేహాలు తీర్చుకోవడానికి ప్రతాప్ ని అడగమనే వారు. ప్రదీప్ ప్రతాప్ నుంచి చాలా విషయాలు నేర్చుకునేవాడు. ఈ క్రమంలో ప్రతాప్ కు తాను ప్రదీప్ కన్నా గొప్ప అనే అహంభావం కలగ సాగింది. అతడు అదే భావంతో పెరిగి పెద్ద అయ్యాడు. తమ్ముడికి ఏదైనా సహయాము కావాలంటే చేస్తాడు. కానీ తాను తమ్ముడితో సమానం అని అంటే ఒప్పుకోడు. మాస్టారు కొడుకులిద్దరినీ బాగా చదివించారు. వారు ఎదిగి మంచి ఉద్యోగం సంపాదించి ప్రయోజకులయ్యారు. మాస్టారు ఇద్దరినీ చూసి చాలా సంతోషించేవారు. ఇలా ఉండగా ఆర్ధిక మాంద్యము వలన ప్రతాప్ తన ఉద్యోగం కోల్పోయాడు. ఎంత ప్రయత్నించినా సరైన ఉద్యోగం దొరక లేదు. ఒక రోజు మాస్టారు ప్రతాప్ తో తమ్ముడి ఉద్యోగం బానే ఉంది కదా వాడిని కొంత డబ్బు సాయం అడిగి ఏదైనా వ్యాపారం చేసుకో అని సలహా ఇచ్చారు. కానీ తనకన్నా తక్కువ వాడిచే సహాయం పొందటం ప్రతాప్ కు సరైనదనిపించలేదు. అందుకని తన మిత్రుల వద్ద అప్పు తీసుకుని వ్యాపారం ప్రారంభించాడు. కానీ ఆర్థికమాంద్యం వలన వ్యాపారం కూడా రాణించలేదు. పెట్టిన డబ్బు అంతా నష్టపోయాడు. ఈ ఒడిదుడుకులవలన తన ఆరోగ్యం కూడా దెబ్బతింది. అసలు ఎం చేయాలో దిక్కు తోచని పరిస్థితులతో కొన్నాళ్లు సతమతమయ్యాడు. ఇదే తరుణంలో ప్రదీప్ కి మంచి పదవోన్నతి కలిగి అతని జీతం బాగా పెరిగింది. ఈ వార్త విని మాస్టారు చాలా సంతోషించారు. కానీ ప్రతాప్ దీనిని జీర్ణించుకోలేక పోయాడు. క్రమేపీ ఆర్ధికమాంద్యము తగ్గింది. మళ్ళీ ప్రతాప్ కి మంచి ఉద్యోగం వచ్చింది. మాస్టారు కొడుకులిద్దరూ తమ తమ ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు, మాస్టారు వారిని చూసి ఎంతో సంతోషించారు. 

ఈ రెండు కథలలోను ఉన్న పోలికను మీరు గమనించి ఉంటారు. ఈ పోలికను కనిపెట్టింది మీ మెదడులోని శ్రుతియే. అదే రంధ్రాన్వేషణ ప్రక్రియ. 

శృతి - సమస్య - పరిష్కారం 

ఏదైనా సమస్యను పరిష్కారించాలంటే అది శృతి వలనే సాధ్యం. అదెలాగో చూద్దాం. ఏదైనా వినగానే అది మొదట స్మ్రుతి ద్వారా పురాణంలో పొందు పరచబడుతుంది. అయితే అది మనం రాసుకునే గద్యంలా కాకుండా వృత్తాలు రేఖలు కలిగిన రేఖా చిత్రాలలా పొందు పరచబడుతుంది. (గమనిక - గుడ్డిగా భట్టీ పెట్టేస్తే రేఖా చిత్రాలు పొందుపరచబడవు. అందుకే అటువంటి జ్ఞానంతో ఆలోచన తెగదు). అప్పుడు శృతి వాటితో రంధ్రాన్వేషణ మొదలుపెడుతుంది. ఈ క్రింది నమూనా చిత్రాలు ద్వారా పైన చెప్పిన కథలు అవి పురాణంలో ఎలా పొందుపరచబడతాయో వివరిస్తున్నాం 

కధ1 - 



కథ2 - 


కథలో ఉన్న వృత్తాలన్నింటిలోకీ ఏ వృత్తానికైతే ఎక్కువ సంబంధాలు ఉంటాయో అదే కొలికి పూస. రంధ్రాన్వేషణ అక్కడినుండే ప్రారంభమవుతుంది. అంటే మొదటి కథలో రైతు, రెండవ కథలో మాస్టారు కొలికి పూసలన్నమాట. అక్కడి నుండి బయలుదేరి దానితో సంబంధం ఉన్న వృత్తాలను చేరుతుంది. మళ్ళీ ఆ వృత్తాలలో ఎక్కువ సంబంధాలున్న వృత్తాన్ని దీనినుంచి సంబంధాలున్న మరికొన్ని వృత్తాలని చేరుకుంటూ కధ అంతా అర్ధం చేసుకుంటుంది. ఇలా విశ్లేషించి శృతి కథ మొత్తానికి మూలం ఏది? శక్తి ఏది? ఏది కీలకం? ఏది వినియోగం అనే అంశాలు నిర్థారిస్తుంది. ఉదాహరణకు మన కథలలో ఈ అంశాలు ఇలా ఉంటాయి 

కథ1


రైతే ఈ కథను నడిపించిన శక్తి. చెట్లు ఇచ్చిన పళ్లే వినియోగం. విత్తనాలు కొన్న అంగడి రెండు చెట్లకూ మూలం. చెట్లు పూర్తిగా ఎదిగి ఉండుట కీలకం. ఇవన్నీ సమానమైతే చెట్లు రెండూ సమానమే అవ్వాలి అన్నది తర్కం. రెండు చెట్లూ ఒకే సారి నాటలేదు కనుక కొన్నాళ్ళు వ్యత్యాసం ఉంటుంది. కానీ పూర్తిగా ఎదిగిన చెట్లకు ఏ వ్యత్యాసం ఉండబోదు. 

కథ2

మాస్టారే ఈ కథను నడిపించిన శక్తి. పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రయోజకులు కావడమే వినియోగం. పిల్లలు పూర్తిగా ఎదిగి ప్రయోజకులుగా బ్రతకడం కీలకం. ఇవన్నీ సమానమైతే పిల్లలు ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పడం కుదరదు. ఇంచుమించుగా ఇద్దరూ ఒకే లాగ మెలగవచ్చు. ఇదే తర్కం. ప్రతాప్ ముందు పుట్టాడు కనుక ఎదిగే వయసులో ప్రదీప్ కన్నా ఎక్కువ ప్రతిభ కనబరుస్తాడు. కానీ ఇద్దరు పెద్దవాళ్లయిన తరువాత కూడా వారి వారి మధ్య అదే వ్యత్యాసం ఉంటుంది అని చెప్పలేము.

ఇదే తర్కాన్ని ఒక రంధ్రంగా ఏర్పరచుకుని పెట్టుకుంటుంది శృతి. ఏవైనా రెండు అంశాలకు మూలము, శక్తి, కీలకము వినియోగము ఒకటే అయితే ఫలితం కూడా ఒకటే అవుతుంది. 

ప్రశ్న: రెండు ఇటుకలు ఉన్నాయి. ఒక్కొక్కటీ సరిగ్గా 5 కిలోలు బరువు ఉన్నాయి. రెండు సమానమైన వ్యశాల్యము కొలమానములతో ఉన్నాయి. ఒక వైజ్ఞానికవేత్త వీటితో ఒక ప్రయోగం చేశాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళను ఇద్దరిని పిలిచి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇటుక ఇచ్చి, ఒకరిని 10వ అంతస్థు ఇంకోరని 15వ అంతస్థు కు వెళ్లి సరిగ్గా 11:00 గంటల సమయానికి ఆ ఇటుకలను క్రింద పడవేయమన్నాడు. ఇప్పుడు ఏ ఇటుక ముందు భూమిని చేరుతుంది? 10వ అంతస్థు వద్ద వదిలినదా 15వ అంతస్థు వద్ద వదిలినదా? 

తర్కం: ఇటుకలు రెండింటినీ కదిలించేది గురుత్వాకర్షణ శక్తి. ఇటుకలు రెండింటినీ నిరోధించేది  వాయు నిరోధక శక్తి. ఇవి రెండు ఇటుకలపైనా ఒకేలా ఉంటాయి. ఇటుకలు రెండింటినీ ఒకే సమయంలో వదిలారు. ఆ రెండింటి బరువు కొలమానాలు కూడా ఒక్కటే. ఇది కీలకం. ఇటుకల మూలము కూడా ఒక్కటే. ఈ ప్రయోగానికి ఫలితం ఇటుకలు భూమిని తాకడం. బీజం, శక్తి, కీలకం, వినియోగం అన్ని ఒకటే అయినప్పుడు ఫలితం కూడా ఒకటే అవ్వాలి. అంటే ఇటుకలు రెండూ ఒకేసారి భూమిని తాకాలి. కాబట్టి శృతి రెండు ఇటుకలు ఒకే సారి భూమిని తాకుతాయి అని జవాబు ఇస్తుంది. 

శృతి - ధర్మ విచక్షణ

ధర్మ విచక్షణ చేయవలసినది శ్రుతియే. స్మృతి శృతి యొక్క నిర్ణయం గురించి ఎదురుచూస్తుంటుంది. కార్యం ఎలా చేయాలి, అసలు చేయాలా వద్దా, లేదా ఇప్పటికి వాయిదా వేయాలా అనేది శృతి యొక్క నిర్ణయం. రోజులు గడిచే కొద్దీ మనుషులు ఏవో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కథల రూపంలో పురాణాన్ని చేరుతాయి. శృతి వాటిపై రంధ్రాన్వేషణ చేసి జ్ఞానం సముపార్జించి పెట్టుకుంటుంది. ఉత్తరోత్రా ఆ జ్ఞానంతోనే ధర్మ విచక్షణ చేస్తుంది. కొలువుకు వెళ్లడానికి ద్విచక్ర వాహనం కొనాలా కారు కొనాలా? ఒకవేళ కారు కొనాలంటే ఉన్న కార్లలో ఏది సరైనది. వారాంతంలో సరదాగా గడపాలంటే చలనచిత్రం చూడాలా లేదా పార్టీకి వెళ్ళాలా? పిల్లవాడు తప్పు చేస్తే వాడిని ఎలా శిక్షించాలి? ఇవాళ భోజనంలో కూర ఏమి చేయాలి? ఈ సారి ఎన్నికలలో ఓటు ఎవరికీ వేయాలి? ఇలా చిన్నదో పెద్దదో కానీ ప్రతీది ఒక నిర్ణయమే. చివరికి ఏ పనీ లేక ఖాళీ ఉండేవాళ్ళకి ఇప్పుడు ఎం చేయాలి అనేది కూడా ఒక నిర్ణయించుకోవలసిన ప్రశ్నే. భగవత్తీర్మాణం ప్రకారం ఈ నిర్ణయాలన్నీ శృతియే తీసుకోవాలి. అదే రంధ్రాన్వేషణ చేయాలి. దానిని ఇంకేదీ లోబరచుకోవడం కానీ ప్రభావితం చేయడం కానీ చేయకూడదు. కానీ ఆలా జరగదు. చిత్తము, అహంకారము, అరిషడ్వార్గములు దానిని ప్రభావితం చేస్తాయి. ఈ మూడింటినే మాయ అని అంటారు. 

ద్రోణుడి కథ

నది ఒడ్డున, భరద్వాజ మహర్షి ఘృతాచి అనే అప్సరసను చూశాడు. అప్పుడతనిలో సంతానోత్పత్తి చేయాలనే కోరిక కలిగింది. అప్పుడతని వీర్యం ఒక కుండ లేదా బుట్టలో పడింది. దాని లోపల, ఒక పిల్లవాడు అభివృద్ధి చెందాడు, అతను ఒక కుండలో జన్మించి ఆశ్రమానికి తీసుకురాబడినందున ద్రోణ అని పేరు పెట్టారు.

భరద్వాజ మహర్షి ఆశ్రమంలో, అతని కుమారుడు ద్రోణుడు మరియు యువరాజు ద్రుపదుడు విద్యను అభ్యసించారు. ద్రోణుడు మరియు ద్రుపదుడు మంచి స్నేహితులయ్యారు, ద్రుపదుడు ద్రోణుడికి అవసరమైనప్పుడు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. కాలం గడిచిపోయింది, ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు అయ్యాడు, ద్రోణుడు ఋషి మరియు గురువు అయ్యాడు. ద్రోణునికి అశ్వత్థామ అనే కొడుకు పుట్టాడు. ద్రోణుడు భౌతిక సంపదపై ఆసక్తి చూపనందున  పేదవాడయ్యాడు. ఒకసారి ద్రోణుని కొడుకు అశ్వత్థామ తన స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అతని స్నేహితులు పాలు తాగుతున్నారు అది చూసి అతను కూడా పాలు తాగాలనుకున్నాడు. అయితే అతని స్నేహితులు పిండిని నీళ్లలో కలిపి అతనికి ఇచ్చారు. ఇది విని ద్రోణుడికి కోపం వచ్చింది. అతను ద్రుపదుని వాగ్దానాన్ని గుర్తుచేసుకున్నాడు. ద్రుపదుని రాజభవనానికి వెళ్లి తన కుమారునికి పాలు అందించడానికి ఒక ఆవును దానం ఇవ్వమని అడిగాడు. కానీ ద్రుపదుడు  నిరాకరించాడు. ఒక బిచ్చగాడు తన స్నేహితుడు ఎలా అవుతాడని ప్రశ్నించి ద్రోణుని అవమానించాడు. ఇది ద్రోణుడికి కోపం తెప్పించింది. అందుకని అతను ద్రుపదుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నాడు.ఈ తరుణంలో భీష్ముడు కృపాచార్యునితో పాటు ద్రోణుడి వద్దకు వచ్చాడు. కురు పాండవులకు విద్య నేర్పించమని అభ్యర్ధించాడు. అందుకు ఒప్పుకుని ద్రోణుడు కురు పాండవులకు సకల విద్యలు బోధించ సాగాడు. 

అర్జునుడు తన సోదరుడు భీముని రాత్రిపూట భోజనం చేయడం ద్వారా ప్రేరణ పొంది, సంపూర్ణ చీకటిలో విలువిద్యలో ప్రావీణ్యం పొందినప్పుడు, ద్రోణుడు కదిలిపోయాడు. ద్రోణుడు అర్జునుడి ఏకాగ్రత, దృఢ సంకల్పాలకు చాలా ముగ్ధుడయ్యాడు. అతను భూమిపై అందరికన్నా గొప్ప విలుకాడు అవుతానని వాగ్దానం చేశాడు. ద్రోణుడు అర్జునుడికి ధనుర్వేదం యొక్క ప్రత్యేక జ్ఞానాన్ని అందించాడు. బ్రహ్మశీర్శాస్త్రం అని పిలువబడే బ్రహ్మ యొక్క అత్యంత శక్తివంతమైన దివ్య ఆయుధాన్ని ప్రయోగించడానికి మంత్రాలను ఇచ్చాడు, అయితే ఈ అజేయమైన ఆయుధాన్ని  ఏ మానవునికి వ్యతిరేకంగా ఉపయోగించవద్దని అర్జునుడికి చెప్పాడు. 

నిషాద అధినేత కుమారుడైన ఏకలవ్య ద్రోణాచార్యుని విలువిద్య ఉపదేశించమని కోరాడు. కానీ అతని తండ్రి మగధ (శత్రువు రాజ్యం) పాలకుడు జరాసంధుడి ఆధ్వర్యంలో సైన్యాధిపతి అయినందున, ద్రోణాచార్య అతనికి కౌరవులు మరియు పాండవులతో శిక్షణ ఇవ్వడానికి నిరాకరించాడు. కానీ దీనితో అధైర్యపడకుండా, ఏకలవ్యుడు ద్రోణాచార్యుని మట్టి విగ్రహాన్ని రూపొందించి, స్వయంగా రహస్యంగా ద్రోణుని వద్దనుండి విలువిద్యాభ్యాసం అభ్యాసం ప్రారంభించాడు. దృఢ సంకల్పంతో ఏకలవ్యుడు అసాధారణ విలువిద్యా నైపుణ్యం సంపాదించాడు.

ఒకరోజు ఏకలవ్యుడు తదేక దీక్షతో కురుపాండవుల శిక్షణా శిబిరం వద్ద వారిని గమనిస్తుండగా చూసి కురు యువరాజులకు చెందిన ఒక కుక్క పెద్దగా మొరగసాగింది. ఏకలవ్యుని దృష్టి ఆ కుక్క మొరిగిన శబ్దంతో చెదిరిపోయింది. క్రోధంతో ఏకలవ్యుడు ఆ కుక్కపై బాణాలను ప్రయోగించాడు. రక్తం చిందకుండా గాయం అవ్వకుండా ఆ కుక్క నోటిని బాణాలతో నింపి అది అరవలేకుండా చేసాడు. అరవలేక ఆ కుక్క కురు యువరాజులు వద్దకు వచ్చేసింది. కురు యువరాజులు ఆ ఉపాయం చూసి ఆశ్చర్యపోయి ఇంత బాగా బాణాలు వేసిన విలుకాడు ఎవరా అని  వెతికారు. కురు పాండవులని చూసి తనని ద్రోణుని శిష్యునిగా పరిచయం చేసుకున్నాడు ఏకలవ్యుడు. అర్జునుడు విలు విద్య నేర్చుకుంటున్న అదే గురువైన ద్రోణుడి దగ్గర పరోక్షంగా నేర్చుకున్నానని చెప్పడు.  అర్జునుడు ఏకలవ్య విలువిద్య నైపుణ్యం చూసి విచారించాడు. ఇంత బాగా బాణాలు వేయగలిగే ప్రతిభ తనలో లేదే అని చాలా బాధపడ్డాడు. ద్రోణుడు చిక్కుల్లో పడ్డాడు: అర్జునుడిని అందరికన్నా గొప్ప విలుకాడిని చేస్తానని తాను చేసిన ప్రతిజ్ఞ ఎలా తీర్చుకోవాలో ఆలోచించసాగాడు.  ఏకలవ్యుని నైపుణ్యాన్ని, అంకితభావాన్ని ఎంతో మెచ్చుకున్నాడు; కాని తన అనుమతి లేకుండా తన వద్దనుండి విలువిద్య నేర్చుకోవడం అతనికి నచ్చలేదు. సమస్యను పరిష్కరించడానికి, ద్రోణుడు ఏకలవ్యను తన విద్యార్థిగా అంగీకరించాడు, కానీ అతని సామర్థ్యాలను మరియు విలువిద్యలో మరింత వృద్ధిని పరిమితం చేయడానికి, అతని ఆధిపత్య చేతిపై బొటనవేలును గురుదక్షిణగా  కోరాడు, తద్వారా విలువిద్యలో అర్జునుని ఆధిపత్యం ఖాయం అయ్యింది. అర్జునుడు శాంతించాడు. ఏకలవ్యుడు శ్రేష్ఠమైన శిష్యుడు కావడంతో వెంటనే తన బొటనవేలును కత్తిరించి ద్రోణుడి పాదాల వద్ద సమర్పించాడు. ఏకలవ్యని త్యాగానికి చలించిన ద్రోణుడు అతని బొటనవేలు లేకుండా కూడా పాండిత్యం పొందేలా దీవించాడు.

ప్రశ్న: అశ్వత్థామకు కృపాచార్యుడు ఏమవుతాడు? 
ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మానవీయ సంబంధాలకు సంబంధించిన రంధ్రాలు శ్రుతిలో ఉండాలి. అవి ఇలా ఉంటాయి. 

గమనిక - ఇక్కడ ఉన్నవి రేఖాచిత్రాలు కదా, రంధ్రాలు ఎక్కడ ఉన్నాయి అనే సందేహం కలుగవచ్చు. ఈ క్రింది వివరణ ఆ సందేహాన్ని తీర్చగలదు.

ద్రోణుని కథలో అశ్వత్ధామను కృపాచార్యునితో కలిపే వృత్తాలు రేఖలు ఇలా ఉన్నాయి. 

1. అశ్వత్ధామ --కు -- తండ్రి --> ద్రోణుడు-- కి -- భార్య -->కృపి --కి అన్న/తమ్ముడు --> కృప --కు -----------> అశ్వత్ధామ
2. అశ్వత్ధామ--కు -- తండ్రి --> ద్రోణుడు --కి -- బావమరిది --> కృప --కు -------> అశ్వత్ధామ
3. అశ్వత్ధామ--కు -- తండ్రి --> ద్రోణుడు --ని -- అభ్యర్దించాడు --> కృప --------> అశ్వత్ధామ

పైన ఉన్న మూడు గొలుసుల్ని మీరు గమనించినట్లయితే ఒక విషయం అవగతమవుతుంది. అవన్నీ అశ్వత్ధామ తో మొదలయ్యి మళ్ళీ అశ్వత్ధామ తో ముగుస్తున్నాయి. వీటిని మాలగా కడితే అశ్వత్ధామ కొలికి పూస అవుతుంది. ఆలా ఆవిర్భవించినదే రంధ్రం. ఎక్కడనుంచి మొదలయ్యిందో మళ్ళీ అక్కడకే చేరుకునేది అన్నమాట. కానీ సమస్య ఏమిటంటే కృపకు అశ్వత్ధామకు మధ్య సంబంధం తెలియదు. అందుకని రంధ్రం పూర్తి అవ్వటంలేదు. ఇప్పుడు మానవీయ సంబంధాల రేఖా చిత్రాన్ని ఉపయోగించి ఈ సంబంధం ఏమిటో తెలుసుకోవాలి. మూడవ గొలుసులో అభ్యర్ధించాడు అనే సంబంధం మానవీయ సంబంధాల రేఖా చిత్రంలో ఎక్కడా లేదు. కనుక దానిని వదిలేస్తాము. మొదటి గొలుసులోని తండ్రి, భార్య అన్న/తమ్ముడు అనే సంబంధాలు మానవీయ సంబంధాల రేఖా చిత్రంలో ఈ క్రింది గొలుసుతో కలుస్తున్నాయి 

అబ్బాయి --కి --తండ్రి --నాన్న --కి -- భార్య -- అమ్మ --కి --అన్న/తమ్ముడు--> మావయ్య. అబ్బాయి స్థానంలో అశ్వత్ధామ, నాన్న స్థానంలో ద్రోణుడు, అమ్మ స్థానంలో కృపి మావయ్య స్థానంలో కృప సరిగ్గా సరిపోతారు. అయితే ఇప్పుడు ఇప్పుడు అబ్బాయికి మావయ్యకి సంబంధం ఏమిటో తెలుసుకుంటే గొలుసు పూర్తి అవుతుంది. అంటే గొలుసు చివర అబ్బాయి --కి --> మావయ్య --> మావయ్య అనేది చేరిస్తే అది పూర్తి రంధ్రంగా ఏర్పడుతుంది. అప్పుడు పూర్తి గొలుసు ఇలా ఉంటుంది. అబ్బాయి --కి --తండ్రి --నాన్న --కి -- భార్య -- అమ్మ --కి --అన్న/తమ్ముడు--> మావయ్య <--మావయ్య --కి -- అబ్బాయి. అంటే అశ్వత్ధామ కు కృప మావయ్య అవుతాడు అన్నమాట. రెండవ గొలుసులో బావమరిది అనే సంబంధం ఉపయోగించినా ఇదే సమాధానం వస్తుంది. అప్పుడు దొరికిన సమాధానం పై మరింత విశ్వాసం కలుగుతుంది. ఇదే రంధ్రాన్వేషణ. ఇలాగే మన బుద్ధి అనేక సమస్యలకు సమాధానం వెతుకుతూ ఉంటుంది. ఇది చాలా చిన్న సమస్య. ఇది తెలుసుకోవడానికి ఇంత చేయాలా అమ్మ అన్నయ్య/తమ్ముడు మావయ్య అని అందరికి తెలుసుకదా అని అనిపించవచ్చు. కానీ మనం రెప్పపాటులో అవలీలగా చెప్పే ఈ సమాధానం వెనుక మెదడులో ఇంత ప్రక్రియ ఉంటుంది. ఈ రంధ్రాన్వేషణతోనే మనిషి అనేకానేక సమస్యలకు సమాధానాలు కనుగొంటాడు. 

* చిత్తం *

చిత్తం నుండే చైతన్యం ఉద్భవిస్తుంది. ఇది అంశాలను మరియు వాటి  యొక్క గుణాలను, తన వద్ద పొందు పరచుకుంటుంది. అంటే అంశం యొక్క నామం, రూపం, రుచి, బరువు, ఆకృతి, మృదుత్వం, శబ్దం, వాసన, వేగం, మంచి, చెడు మొదలైన గుణగణాలు చిత్తంలో ఉంటాయి. ఈ చిత్తం అంశాలను ఇష్టాలు లేక అయిష్టాలుగా లెక్క వేసుకుంటుంది. తీరిక సమయాలలో మది ఈ చిత్తంలో ఉన్న అంశాలపైనే రంధ్రాన్వేషణ జరుపుతూ ఉంటుంది. ఇదే అభ్యున్నతికి మూలం. చిత్తంలోని అత్యంత ప్రీతిపదమైన అంశాలలో మామిడికాయ పప్పు ఉంటె రంధ్రాన్వేషణ మంచి మామిడికాయ ఎక్కడ లభిస్తుంది, అందులో రకాలు ఎన్ని, మొదలైన విషయాలపై జరుగుతుంది. కొడుకో కూతురో అత్యంత ప్రీతిపదమైనది అయితే వారు ఎం చేస్తుంటారు, ఎం కొనిస్తే సంతోష పడతారు మొదలైన విషయాలపై  జరుగుతుంది. గణిత శాస్త్రం ప్రీతిపాదమైనదైతే వివిధ రకాల గణిత ప్రక్రియలపై రంధ్రాన్వేషణ జరుగుతుంది. అదే చిత్తంలో రాముడు ఉంటె రంధ్రాన్వేషణ రామాయణంలోని వివిధ సంఘటనలపై జరుగుతుంది. 

చిత్తం ఎప్పుడూ కొత్త అనుభూతులను వెతుకుతూ ఉంటుంది. అందువలనే మనుషులు పదే పదే ఒకే పని చేస్తే విసిగిపోతాడు. మామిడికాయ పప్పు ఇష్టమే కానీ రోజూ అదే పప్పు తినాలంటే విసుగువస్తుంది. రాముడు అంటే ఇష్టమే కానీ అహోరాత్రులు రామాయణమే చదవాలంటే కష్టం అనిపిస్తుంది. అందుకని అది శృతి తీసుకునే నిర్ణయాలను తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రభావితం చేస్తుంది. మామిడికాయ పప్పు, పిల్లలు, గణితం, రామాయణం అన్నీ ఒకే మనిషి చిత్తంలో ఉండి ఉండవచ్చు. ఉదాహరణకు ఉదయం కాసేపు రామాయణం చదవాలనిపిస్తుంది. ఒక 3-4 గంటలు చదివాక ఇక దానిమీద శ్రద్ధ తగ్గిపోతుంది. మంచి ఆకలి వేస్తోంది చక్కగా మామిడికాయ పప్పువేసుకుని భోజనం తినాలనిపిస్తుంది. ఆ తరువాత పిల్లలను చేరదీసి వారికి గణితంలో ఏదైనా ఒక కొత్త ప్రక్రియ నేర్పాలనిపిస్తుంది. తరువాత వారితో కలిసి ఏదైనా సరదా కాలక్షేపం చేయాలనిపిస్తుంది. ఇలా మనిషిని తిప్పుతూ ఉంటుంది. దీనినే క్షణభంగురం అని అంటారు. ఆత్మదర్శనం జరిగి అమృత ధారల రుచి చూసే వరకు ఈ తిరుగుడు ఆగదు. 

గమనిక - ఏదైనా విషయంపై అంతిమ నిర్ణయం శృతిదే. దానికి తిరుగులేదు. కానీ నిర్ణయం తీసుకునే సమయంలో రంధ్రాన్వేషణ జరుగుతున్నపుడు చిత్తం తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా దానిని ప్రభావితం చేయగలదు. శృతి తీసుకునే నిర్ణయం తన అయిష్టాలకు దూరంగా ఇష్టాలకు దగ్గరగా ఉండేలా చేయగలదు. 

* అహంకారము *

అహంకారము అంటే నేను, నాది, నాకు అనే భావన. పుట్టినప్పుడు ఈ భావన మనలో ఉండదు. కానీ మనకు తెలియకుండానే ఇది ఏర్పడి ఎదిగే కొద్దీ బలపడిపోతుంది. దీనంతటికీ మూలం శరీరంపై మమకారమే. చిత్తంలోని అత్యంత ప్రీతిపదమైన అంశాలలో శరీరం ఉంటుంది. దానిని నేను అని, దానికి సంబందించినవి నావి అని, దానికోసమైనవి నాకు అని పురాణంలోకి ఎక్కిపోతాయి. ఆ తరువాత రంధ్రాన్వేషణ కూడా వాటిపైనే జరుగుతుంది. 

ఉదాహరణకి ప్రతాప్ ప్రదీప్ ల కథ ప్రతాప్ మెదడులో పైన చెప్పిన విధంగా కాకుండా ప్రతాప్ దృష్టికోణంలో ఉంటుంది. అది ఇలా ఉంటుంది. 

ప్రతాప్ బాల్యంలో 
ఈ తరుణంలో మాస్టారు ప్రతాప్ ను మంచి ఆహారం తినడానికి ఉత్సాహపరుస్తూ, "బాబూ ప్రతాప్! నువ్వు కడుపునిండా అమ్మ పెట్టిన భోజనం తినాలి. లేకపోతే నువ్వు బలహీనంగా ఉంటావు. అప్పుడు నువ్వు పోటీలలో గెలవలేవు. వేగంగా నీ కొత్త సైకిల్ తొక్కలేవు. అస్తమాను జ్వరం వస్తుంది. అంతేకాదు, నువ్వు బలంగా ఉంటె ఇతరులకు సహాయపడగలవు. అప్పుడు నిన్ను అందరూ మెచ్చుకుంటారు. అందుకని నువ్వు అమ్మ పెట్టిన భోజనం వద్దనకుండా కడుపునిండా తెనాలి సరేనా" అని ముద్దుగా చెప్పారనుకోండి. అది పురాణంలోకి ఇలా ఎక్కుతుంది. 
ప్రతాప్ చిత్తంలో సైకిల్ రేస్, నేను, నాన్న, ప్రదీప్ ఉన్నారు. ఆ అంశాలపై పైన ఉన్న రేఖా చిత్రాన్ని అనుసరించి రంధ్రాన్వేషణ చేస్తే అతని శృతిలో ఇటువంటి రంధ్రాలు ఏర్పడుతాయి. 
ఇలా రంధ్రాలు ఏర్పడిన తరువాత ప్రతాప్ తీసుకునే నిర్ణయాలలో అతను ప్రదీప్ కన్నా గొప్ప అనే అంశం ఇమిడిపోతుంది. దీనిని చిన్నప్పుడే గమనించి మాస్టారు సరిదిద్దకపోతే అతను పెరిగి పెద్దయ్యేకొద్దీ ఈ భావన మరింత బలపడుతూ ఉంటుంది. పైన చెప్పిన కధలో మాస్టారు ఆ పని చేయలేదు. అందుకే ప్రతాప్ పెద్దయ్యాక ఆర్థికమాంద్యము వలన ఉద్యోగం కోల్పోయి ఉన్నపుడు ప్రదీప్ నుండి సహాయం స్వీకరించలేకపోయాడు. 

ఇలా జరగకుండా ఉండాలంటే మనము సన్నివేశాలను మన దృక్కులతో కాకుండా యజమాని దృక్కులతో పరిశీలించాలి. ఇంట్లో ఉన్నపుడు నాన్నగారి దృక్కులతో, పాఠశాలలో అధ్యాపకుని దృక్కులతో, కొలువులో ఉన్నపుడు పై అధికారి దృక్కులతో పరిశీలించాలి.

కథ3
కురుపాండవులిద్దరికి విద్యా శిక్షణ పూర్తి అయ్యాక ఒకనాడు ద్రోణుడు దుర్యోధనుడికి భీముడికి గదా యుద్ధంలో ద్వంద్వ పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఇద్దరికీ కబురు చేసాడు. వారిరువురితోపాటు కురుపాండవులందరూ ఆ పోటీని తిలకించడానికి అక్కడకు సమావేశమయ్యారు. మొదట దుర్యోధనుడు తన గదను తీసుకుని వచ్చి అహంకార మదంతో ఇలా అన్నాడు, "చెప్పండి గురుదేవా! ఈ గదతో ఆ దూరాన ఉన్న బండలను పిప్పి చేయమందురా! లేదా ఒక్క దెబ్బతో ఈ వృక్షమును శాఖోపశాఖలుగా వేరుచేయమందురా! లేక ఇక్కడినుంచే నా గదను విసిరి దూరాన ఉన్న ఆ ఏనుగు కుంభ స్థలాన్ని బద్దలుకొత్తమందురా! సెలవీయండి గురువర్యా! అతి పరాక్రమవంతుడైన ఈ దుర్యోధనుడు ఏమి చేయవలెనో" అన్నాడు. అప్పుడు ద్రోణుడు సంతోషించి, భీముడివైపు చూసి దగ్గరకు రమ్మని సైగ చేసాడు. భీముడు తన గద తీసుకు వచ్చి, సవినయంగా నమస్కరించి, "ఆజ్ఞ గురుదేవా" అని అన్నాడు. 

మధ్యలో ద్రోణుడితో పాటు పోటీకి వచ్చిన భీముడు దుర్యోధనుడు ఉన్నారు. చుట్టూ పోటీని చూడటానికి వచ్చిన కౌరవులు, పాండవులు ఉన్నారు. అప్పడు ద్రోణుడు రెండు కోడి గుడ్లు తెప్పించాడు. ఒక గుడ్డును నేల మీద పెట్టి దుర్యోధనుడితో ఇలా అన్నాడు, "ఈ గుడ్డుకు బీట రావాలి, కానీ అది పగిలి అందులోని రసం బయటకు రాకూడదు, కేవలం ఒక చిన్న బీట మాత్రమే వచ్చేలా దానిని కొట్టు" అని అన్నాడు. అదివిని దుర్యోధనుడు ఖంగు తిన్నాడు. అంత బరువైన గదతో అంత అల్పమైన గుడ్డు పగలకుండా కేవలం చిన్న బీట పడేలా కొట్టడం ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచింపసాగాడు. ఎంత ఆలోచించినా అతనికి ఏ ఉపాయము కనపడలేదు. చివరకు తన గదతో మెల్లగా గుడ్డును బీట వచ్చేలా కొట్టడానికి విఫలయత్నం చేసాడు. గదను తాకగానే గుడ్డు పగిలి అందులోని రసం బయటకు వచ్చింది. ఖిన్నుడై దుర్యోధనుడు వెనుదిరిగాడు. తరువాత భీముడు వచ్చాడు. ద్రోణుడికి శిరస్సువంచి నమస్కరించి, "నాదొక విన్నపము గురువర్యా, అడగమంటారా" అన్నాడు. అడగమన్నాడు ద్రోణుడు. అప్పుడు భీముడు, "మీరు గుడ్డు పగలకుండా బీటలువారేలా చేయమన్నారే తప్ప గదను వాడాలి అని చెప్పలేదు. కావున మీరు అంగీకరిస్తే ఈ పనికి నేను గదను వదిలి ఒక చిన్న చెక్క పేడు వాడుతాను" అని అన్నాడు. సరే అన్నాడు ద్రోణుడు. వెంటనే భీముడు ఒక చిన్న పేడును తీసుకుని సున్నితంగా గుడ్డును కొట్టాడు. దానికి చిన్న బీట రాగానే ఆపేశాడు. అప్పుడు భీముడే పోటీని గెలిచినట్లు ద్రోణుడు ప్రకటించాడు. 

ఇదంతా చూసిన ధర్మరాజు ఆ రోజు సాయంత్రం ద్రోణుడి వద్దకు వెళ్లి జరిగిన దాని తాత్పర్యం వివరించమని అడిగాడు. అప్పుడు ద్రోణుడు, "ధర్మరాజా! మీ అందరికీ విద్య నేర్పించింది నేనే. మీ అందరి ప్రతాపము నాకు ఎరుకే. మీలో ఎవరెవరు ఎటువంటి శత్రువులను ఛేదించగలరో కూడా నాకు తెలుసు. కానీ ఇవాళ్టి పరీక్ష మీకు బయట ప్రపంచంలో ఉన్న శత్రువుల గురించి కాదు. మీ లోపల ఉన్న శత్రువును అంటే మీ అహంకారాన్ని ఎంత వరకూ ఛేదించగలరు అనే దానిగురించి. దుర్యోధనుడు పోటీని కేవలం తన దృక్కులతోనే చూసాడు. అందుకే అతనికి గద తప్ప మరొక ఆయుధం వాడవచ్చు అన్న విషయం స్ఫురించలేదు. భీముడు పోటీని నా దృక్కులతో పరిశీలించాడు. అందుకే అతను గెలిచాడు. మెదడులో నేను, నాది, నన్ను, నాకు అనే రంధ్రాలు పెరిగే కొద్దీ సన్నివేశాన్ని ఎదుటివాడి దృక్కులతో పరిశీలించే శక్తి తగ్గిపోతుంది. అటువంటివారు రాణించలేరు. వారి అహంకారమే వారిని నాశనం చేస్తుంది." అని చెప్పాడు. 

కధ4
ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక పెంపుడు కుక్క ఉండేది. ఆ రాజుకు తన కుక్క అంటే అత్యంత ప్రీతి. ఎక్కడికి వెళ్లినా దానిని తన వెంట తీసుకుని వెళ్ళేవాడు. భోజనం కూడా ఇద్దరూ కలిసి చేసే వారు. ఊరేగింపులో కూడా రాజు తన కుక్కను తోడు తీసుకుని వెళ్లే వాడు. రాజ్యంలోని వారందరూ రాజుగారితో పాటు ఆ కుక్కను కూడా ఏంతో ప్రశంశించేవారు. తన జీవితంలోని ప్రతీ క్షణము కుక్కమీద అనుబంధంతో పెనవేసుకుని ఉన్న తరుణంలో ఒకరోజు ఆ కుక్క అకాల మరణం పొందింది. రాజు అంతులేని మానసిక దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఎందరో వచ్చి సానుభూతి తెలిపారు. మంత్రులు, సామంతులు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ రాజు తేరుకోలేదు. రోజులు గడిచినా రాజుకు దుఃఖం ఆగటంలేదు. ఆ కుక్క శవం వద్ద కూర్చుని దుఃఖిస్తూనే ఉన్నాడు. మంత్రులు పండితులను పిలిచి ఏదైనా ఉపాయం చెప్పి రాజును శాంతింపజేయమని కోరారు. అప్పడు కొందరు పండితులు అలాంటిదే మరో కుక్కను తెప్పిద్దామన్నారు. రాజుగారికి నచ్చలేదు. కొందరు ఈ మాటు అంతకన్నా గొప్పదైన జాతి కుక్కను తెప్పిద్దామన్నారు. అయినా రాజుగారు ఊరుకోలేదు. కొందరు ఈ మాటు కుక్కకు బదులు పిల్లిని పెంచుకోమని సలహా ఇచ్చారు. అయినా రాజుగారు శాంతించలేదు. అప్పుడు ఒక పండితుడు, రాజు గారి కుక్క కళేబరాన్ని బంగారు రథంలో ఊరేగిస్తూ రాజ్యమంతా తిప్పి చివరకు స్మశానానికి తీసుకువెళదాము. దానిని దహనం చేసిన చోట, బంగారంతో ఒక స్మారక విగ్రహం పెడదాము. దాని చుట్టూ మంచి ఉద్యానవనం నిర్మించి రాజుగారి పేరు ఆచంద్రతారార్కం గుర్తుండిపోయేలా చేద్దాం అన్నాడు. ఆ ఉపాయం రాజుగారికి చాలా నచ్చింది. వెంటనే ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. 

కుక్క మృత కళేబరంతో ఊరేగింపు బయలుదేరింది. బంగారు రథంలో అందరికీ కనిపించేలా కుక్క కళేబరాన్ని ఉంచారు. దాని వెనుకనే రాజుగారు తన పరివారంతో పయనమయ్యారు. ప్రజలందరూ కుక్కపై పువ్వులు, పన్నీరు చల్లుతున్నారు. రాజుగారి ఆలోచనకి జోహార్లు పలుకుతున్నారు. అక్కడ జరిపిన ఏర్పాట్లను ఎంతో మెచ్చుకున్నారు. రాజుగారు మాళ్ళీ చాలా సంతోషించారు. ఇంతలో ఆ కుక్క లేచి కూర్చుంది. అది చూసి అందరూ నివ్వెరపోయారు. ఈ కుక్క చావకుండానే చచ్చిందనుకుని ఇంత హడావిడి చేశారా అని నోరు నిక్కుకున్నారు.  ఉరేగింపు మధ్యలో జనమందరూ చూస్తుండగా తనకు జరిగిన అవమానానికి క్రుద్ధుడైనాడు రాజు. తన పరువు కాపాడుకోడానికి వెంటనే ఆ కుక్కను హతమార్చమని ఆదేశించాడు. ఇదే అహంకారం అంటే. 

* శృతి - అహంకారము *

శ్రుతిలోని రంధ్రాలలో నేను, నాది, నాకు, నన్ను అనే రంధ్రాలు ఏర్పడడం వలెనే అహంకారము వస్తుంది అని పైన వివరించాము. ఇప్పుడు అసలు అటువంటి రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయో తెలుసుకుందాము. నిజానికి క్షరమైన వాటితో రంధ్రాలు ఏర్పడకూడదు. కానీ మన జీవనం సాగే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా మనుషులు అందరూ ఎదో ఒక ఇంట్లో పుడతారు. పుట్టినప్పుడు వారికి ఎటువంటి జ్ఞానము ఉండదు. మెల్లగా అమ్మ నాన్న, అన్న, అక్క మొదలైనవారు మనతో జరిపే సంభాషణలతో మరియు మన చుట్టూ జరిగే సంఘటనలతో జ్ఞానం సముపార్జిస్తాము. ఉదాహరణకి చిన్న పిల్లవాడికి స్నానాలగదికి వెళ్లి మూత్రవిసర్జన చేయాలని తెలీయదు. అప్పుడు అమ్మ అక్కనో, అన్ననో చూపించి, "అదుగో చూడు, అన్నయ్య ఎప్పుడైనా ఇలా మూత్రవిసర్జన చేసాడా? లేదు. నువ్వు కూడా వాడి లాగే స్నానాల గదికి వెళ్లి చేయాలి. ఈ సారి నీకు మూత్రం వచ్చినప్పుడు నన్ను పిలువు, నేను నిన్ను స్నానాల గదికి తీసుకు వెళ్తాను" అని అంటుంది. అలాగ రెండు మూడు సార్లు చెప్పాక, పిల్లవాడు అమ్మ చెప్పినట్లు చేయడం మొదలు పెడతాడు. తరువాత కొన్నాళ్ళకు మట్టిలో ఆడకూడదని, ఎడం చేత్తో అన్నం తినకూడదని, గట్టిగా అరవకూడదని, ఇలా ఎన్నో విషయాలు అమ్మా మరియు నాన్న బోధిస్తారు. పిల్లవాడు నేర్చుకుంటాడు. కానీ ఆ పసి వయస్సులో వాడికి మట్టిలో క్రిములు ఉంటాయి అని, వాటి వలన రోగాలు వస్తాయి అని తెలిసే ప్రసక్తి లేదు. అందుకని వాడు మట్టిలో ఆడితే అమ్మకు కోపం వస్తుంది. కోపం వస్తే అమ్మ గట్టిగ తిడుతుంది. అప్పుడు నాకు భయం వేస్తుంది. కనుక నేను ఈ పని చెయ్యకూడదు. అని శ్రుతిలో ఒక రంధ్రం ఏర్పరచుకుంటాడు. అంటే వాడికి తెలియకుండానే నేను, నాది అనేవి వాడి శ్రుతిలోకి వెళ్లిపోతున్నాయి. అందుకే పిల్లలని గట్టిగా అరిచి బెదిరించకూడదు అని అంటారు. ఓపిగ్గా విషయమంతా వారికి అర్ధం అయ్యేలా చెప్పాలి. దీనికి ఎక్కువ సమయం పట్టినా అది తప్పదు. 

బాల్యావస్థలో అంటే మొదటి ఎనిమిదేళ్లు పిల్లలు ప్రపంచాన్ని తమ తల్లిదండ్రుల దృక్కులతో చూస్తారు. ఎందుకంటే ఆ ప్రాయంలో వారు శక్తి మరియు జ్ఞాన హీనులు. ప్రతీ పనికీ వారు తల్లిదండ్రులపైనే ఆధార పడతారు. అన్ని విషయాలలోనూ వారినే అనుకరిస్తారు. ఈ ప్రాయంలో తల్లిదండ్రుల ప్రభావం వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. తెలుసుకుందాం, నేర్చుకుందాం అనే ఆత్రంతో వారు తల్లిదండ్రులు చెప్పిన విషయాలను యధాతధంగా స్వీకరిస్తారు. ముఖ్యంగా ఇల్లు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో వారి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా భారతీయ సంస్కృతిలో గృహములో భర్తే యజమాని. అందుకని పిల్లలు ఇంటిని నాన్న దృక్కులతో పరిశీలిస్తారు. ఆయన వ్యక్తిత్వాన్నే అలవాటు చేసుకుంటారు. పెరిగి పెద్దయ్యి ఆయనలాగే వ్యవరిస్తుంటారు. అందుకే ఆత్మావై పుత్రనామాసి అంది వేదం. మరి ఇటువంటి పరిస్థితులలో క్షరమైనవేవీ శృతి రంధ్రాలలో ఉండకూడదు అంటే ఎలా? మనిషి మనుగడ మొదలయ్యిందే అమ్మ నాన్న అనే అనుబంధంతో. పూర్తిగా శూన్యంలో ఉన్న మెదడులో అమ్మ, నాన్న, నేను, అక్క, చెల్లి మొదలైనవి లేకుండా ఒకేసారి పరమాత్మ యొక్క పంచకృత్య పరాయణత్వము ఎలా చేరుతుంది? ఇది సాధ్యం కాదు. అందుకే అహంకారం అందరికీ ఉంటుంది. ఇదే మాయ.దేనిని పట్టుకుని మనం బ్రతుకు మొదలు పెట్టామో అదే చివరకు ప్రమాదమే కూర్చుంటుంది. దానిని వదిలించుకోవడానికి మళ్ళీ విశ్వప్రయత్నం చేయాలి. ఇది తప్పదు. 

* అరిషడ్వర్గములు *

అహంకారానికి ఆరు కాళ్ళు. అవే అరిషడ్వార్గములు. అవి 1.కామ, 2.క్రోధ, 3.లోభ, 4.మోహ, 5.మద, మత్సరములు. కోరిక తీరితే కామము (సంతోషము). తీరకపోతే క్రోధము. నాలుగవ కథలో రాజుగారికి అనన్య సామాన్యమైన కీర్తి అనునిత్యం పొగడ్తలు కావలి. అది ఆయన కోరిక. కుక్క కళేబరాన్ని ఊరేగిస్తున్నపుడు ఆయన కోరిక తీరింది. కనుక సంతోషం. అది లెవగానే కోరిక తీరలేదు. అందుకే క్రోధం. అది చచ్చి పడున్నప్పుడు మొహం. ఏ పనికి ఉత్సాహముండదు. ఎందుకంటే రాజుగారి కుక్క చనిపోయింది అనే వార్తలో సానుభూతే తప్ప కీర్తి లేదు. పండితుడి ఉపాయం వలన మళ్ళీ కీర్తిని సంపాదించే దారి దొరికింది. అందుకని లోభం. ఎంత చేసినా సరిపోదు. నేను ఎదుటివాడికన్నా గొప్ప అనే భావన మదం. ఎదుటివాడు నాకన్నా గొప్ప అనే భావం మత్సరం. వీటి ద్వారానే అహంకారం మన మెదడుని దొలిచి చివరకు మనల్ని నాశనం చేస్తుంది. 

* లక్ష్య సాధన *

మానవ శరీరంలో ప్రధానంగా 24 తత్వాలు ఉన్నాయి. అవి ఇలా ఉంటాయి. 5 కర్మేంద్రియాలు - కాళ్ళు, చేతులు, నోరు, ప్రత్యుత్పత్తి అవయవాలు, మలమూత్ర అవయవాలు. 5 జ్ఞానేంద్రియాలు - కళ్ళు, నాలుక, ముక్కు, చెవులు, చర్మం. పంచభూతాలు - గాలి, నీరు, అగ్ని, పృథివీ, ఆకాశం. 5 తన్మాత్రలు - నీటికి నాలుకకి తన్మాత్ర, చెవికి ఆకాశానికి తన్మాత్ర, కంటికి అగ్నికి తన్మాత్ర, ముక్కుకి పృథివికి తన్మాత్ర, చర్మానికి గాలికి తన్మాత్ర. ఇక్కడికి ఇరవై. 21.మనస్సు, 22.బుద్ధి/శృతి, 23.చిత్తం, 24.అహంకారం. వీటి ద్వారానే మనుషులు వివిధ రకముల కర్మలు చేస్తుంటారు. 

మొదట పంచభూతాల పంచీకరణం జరుగుతుంది. అప్పుడు 5 కర్మేంద్రియాలు, 5జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకు దాసులు. ఎక్కువసేపు అచేతనంగా ఉంటె అవి బాధ పడతాయి. అప్పుడు కాళ్ళు కాసేపు నడుద్దాము అని అనుకుంటాయి. చేతులు కాస్త గట్టిగా బిగించి ఒళ్ళు విరుచుకోవాలి అనుకుంటాయి. నోరు మాట్లాతానంటుంది. కానీ ఇవి ఏమైనా చేయాలంటే జ్ఞానేంద్రియాల ఆమోదం కావలి. వాటి ఆమోదం తీసుకుని ఇవి కదిలినపుడు శరీరంలోని కొన్ని గ్రంధులలో హార్మోన్లు స్రవిస్తాయి. దాని వలన మనకు సంతోషంగా ఉంటుంది.

జ్ఞానేంద్రియాలకు నిర్ణయాత్మక శక్తిలేదు. అవి మనస్సుకు దాసులు. అవి ఏమి చేయాలన్నా మరియు కర్మేంద్రియాలతో ఏదైనా చేయించాలన్న మనస్సు నుంచి ఆదేశం రావాలి. వాటికి పంచభూతాలతో తన్మాత్రలు ఉంటాయి. కంటికి రంగురంగుల కాంతిని చుస్తే సంతోషం. ఒక్కొక్క రంగుని చూసినప్పుడు అది ఒక్కొక్క అనుభూతిని కలిగిస్తుంది. కారుచీకటి అన్నా కళ్ళు బైర్లు కమ్మే వెళుతురు అన్నా దానికి భయం. చర్మానికి మెత్తగా మృదువుగా ఉండే ఆకృతులు అంటే ఇష్టం. చల్లటి గాలి, వెచ్చటి నీరు మొదలైనవి ఇష్టం. విపరీతమైన వేడి లేదా చల్లదనం అంటే దానికి భయం. నాలుకకు మంచి రుచులు కావాలి. దాహానికి గొంతు ఎండిపోతుంటే అదే తట్టుకోలేడు. ముక్కుకు పృధివినుంచి వచ్చిన వాటి వాసనలు ఇష్టం. పువ్వుల పరిమళము మొదలైనవి. చెవికి  మంచి సంగీతం ఇష్టం. ఆకాశాన్నుంచి వచ్చే ధ్వని తరంగాలు శ్రావ్యంగా ఉంటె అది సంతోషిస్తుంది. భరించలేని ధ్వనులతో అది బాధ పడుతుంది. 

మనస్సుకూ నిర్ణయాత్మక శక్తి ఉండదు. ఇది జ్ఞానేంద్రియాలకు వాటి ద్వారా కర్మేంద్రియాలు ఆజ్ఞలు ఇచ్చి పనిచేయించగలదు. కానీ బుద్ధి ఇచ్చే నిర్ణయానికి ఇది తలవంచి తీరవలసిందే. ఇది చాలా శక్తివంతమైనది. అవసరానికి తగ్గట్టు అలవాట్లు మార్చుకోగలదు. కొత్త కొత్త ఊహలు చేసి జ్ఞానం పెంచగలదు. వివిధ రకాల భావనలతో అంతులేని ఆనందానుభూతి కలిగించగలడు. కానీ ఇది గుడ్డిది. ఇంద్రియాల ద్వారా అలవడిన జ్ఞానమే దీనికి మేత. శృతి ఇచ్చే ఆజ్ఞలు దీనికి తిరుగులేనివి. ఊపిరి వేగానికి దీనిలోని అలజడి ముడిపడి ఉంటుంది. దీనిలోని ఉద్వేగానికి గుండెపోటుకి సంబంధం ఉంటుంది. దీనికి ప్రశాంతత అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఎదో ఒక చింతతో కలవరపడుతూ ఉంటె ఇది చాలా కష్ట పడుతుంది. ఇది కష్టపడితే శరీరమంతా కష్టపడుతుంది. 

శరీరం మొత్తంలో బుద్ధి ఒక్కదానికే నిర్ణయాత్మక శక్తి ఉంది. దీని నిర్ణయం మనస్సుకు ఇంద్రియాలకు శిలాశాసనం. దీనికి రంధ్రాన్వేషణ చేయగలిగే అమోఘమైన శక్తి ఉంది. ఏదైనా కొత్త సమస్యను పరిష్కరించినప్పుడు దీనిలో కొత్త కొత్త రంధ్రాలు ఏర్పడతాయి. అప్పుడు ఇది ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అప్పుడు మనుషులు వెంటనే కళ్ళు పెద్దవిచేసి వేళ్ళతో చిటిక వేసి "వచ్చేసింది" అని చిరునవ్వుతో చెబుతారు. బుద్ధికి స్వతః సుఖదుఃఖాలు ఉండవు. కానీ చిత్తం వలన ఇది ప్రభావం చెందుతుంది. 

చిత్తము అహంకారము బుద్ధిని ప్రభావితం చేయగలవు. వీటి వలన బుద్ధి యొక్క రంధ్రాన్వేషణ, దిశ ధర్మం వైపు కాకుండా స్వార్ధం వైపు మరవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే సాధన చేసేటప్పుడు అంకితభావంతో చేయాలి. అప్పుడు అహంకారం అడ్డు రాదు. నేను, నాది, నాకు అనే భావనలను ఆదిలోనే అంతం చేయాలి. చిత్తానికి శిక్షణ అవసరము. మంచిని అనుసరించడం వలన ఎలా అభ్యున్నతి కలుగుతుంది, చెడు సావాసము వలన ఎలా నాశనం జరుగుతుంది అనే విషయాలు దానికి తెలియజేయాలి. అప్పుడు అది తన ఇష్టాయిష్టాలను తగు రీతిలో మార్చుకోగలదు. 

సాధన సక్రమంగా జరగాలి అంటే ఈ జ్ఞాన సోపానక్రమంలోని 24 తత్వాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై సాధించవలసిన గమ్యం కోసం పాటుపడాలి.


అహంకారం - ఏదైనా లక్ష్యం సాధించే ముందు అహంకారాన్ని విడనాడాలి. మనిషి అభ్యున్నతిలో ఎక్కడ ఎప్పుడూ మంచికి ఉపయోగపడనిది ఈ అహంకారము. భగవద్గీతలో కృష్ణుడు "ఝాహి శత్రు మహాబాహో కామరూపం" అన్నాడు. అంటే ఈ అహంకారమే నీ మొదటి శత్రువు. ఓ వీరుడా దీనిని సంపూర్ణంగా తుదముట్టించు అని అర్ధం. సాధనా ప్రక్రియలో అహంకారము ఎన్నడూ అడ్డు పడకూడదు. నేనేంటి, నాకేంటి అనే ఆలోచనలు దరి చేరనీయకూడదు. కానీ అహంకారాన్ని ఛేదించాలంటే అంత సామాన్యం కాదు. అన్నింటికన్నా గొప్పది, నిర్ణయాత్మక శక్తి కలిగిన శృతినే లొంగదీసుకుని ఉంటుంది ఈ అహంకారము. ఇది బుడగలో గాలి వంటిది. గాలి ఊదితే బుడగ ఎలా పెద్దది అవుతుందో, కామము స్వార్ధచింతన మొదలైన వాటితో ఇది చాలా పెద్దది అవుతుంది. బుడగ చిన్నది అవ్వాలంటే అందులో గాలి తీసేయాలి. అహంకారం మితిమీరిపోకుండా ఉండాలి అంటే కామాన్ని స్వార్ధాన్ని విడనాడాలి. ప్రతిఫలం ఆశించకుండా దానం చేయాలి. మానవ సేవ చేయాలి. అప్పుడు అది మితిమీరిపోకుండా అదుపులో ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించి బుడగలోంచి గాలి తీసేసినా ఎంతో కొంత గాలి అందులో ఉండిపోయినట్లుగా మనం ఎంత ప్రయత్నించినా పూర్తిగా అహంకారాన్ని విడనాడలేము. అందుకు భగవంతుని అనుగ్రహం కావాలి. కేవలం కళ్ళు మూసుకుని గుడ్డిగా దండం పెద్దుకోవడం వలన అహంకారాన్ని అదుపుచేయలేము. భగవంతుని స్తోత్రములుగానీ, మంత్రములుగానీ, కధలు గానీ అర్ధం చేసుకుంటూ ఆమ్నాయించుకోవాలి. అపుడు ఆ మంత్రాలలో/కథలలోని భావాలు మీ శృతి రంధ్రాలను మారుస్తాయి. నేను-నాది నుంచి ఈశ్వరుడు-శక్తి వైపు తిప్పుతాయి. ఉదాహరణకి "ఓం నమఃశివాయ" అనే మంత్రాన్ని తీసుకుందాం. ఓం అంటే సర్వజగత్తుకు మూలము, శక్తి, కీలకము ఆ పరమాత్మ అని అర్ధం. నమఃశివాయ అంటే అటువంటి పరమాత్మ స్వరూపమైన శివునికి నమస్కారములు అని అర్ధం. దృష్టిని స్మృతిపై కేంద్రీకరించి ఈ మంత్రాన్ని పదే పదే జపిస్తే అది మీ పురాణంలోకి వెళుతుంది. అప్పుడు శృతి రంధ్రాన్వేషణ చేసినప్పుడు నేను, నాది తొలగిపోయి ఈశ్వరుడు శక్తి వస్తాయి. పాఠకులకు ఇటువంటి దివ్యమైన ప్రయోజనం కలిగించుటకే ఈ పుస్తకంలోని రెండవ భాగంలో గాయత్రీ విద్య, మూడవ భాగంలో శ్యామలా దండకము ఇచ్చాము. 

చిత్తం - సాధించవలసిన లక్ష్యం చిత్తానికి ఇష్టమైనది అయి ఉండాలి. ఎందుకంటే ఇది సోపానక్రమంలో అత్యంత పైస్థాయిలో ఉంటుంది. దీని చేష్టితముల వలన మిగిలినవి అన్ని ప్రభావితమవుతాయి. అందుకే విజ్ఞులు చేసేది ఏదైనా సరే మనస్సు పెట్టి చేయాలి అని చెబుతుంటారు. చిత్తం ఇష్టాలని అయిష్టాలుగా అయిష్టాలను ఇష్టాలుగా మార్చుకోగలదు. అయితే దానికే చెప్పే పద్దతిలో చెప్పాలి. ఉదాహరణకి మొదట్లో పిల్లలకి బడికి వెళ్ళటం ఇష్టముండదు. కానీ అమ్మ, నాన్న నచ్చజెప్పితే వెళతారు. క్రమేపి అలవాటు అయిపోతుంది. ఇక ఆ తరువాత బడికి వెళ్ళటం కూడా ఇష్టం అయిపోతుంది. ఒక్కొక్కప్పుడు మనకు ఇష్టమైన వారు చెబితే ఒకరిమీద అభిప్రాయం మార్చుకుంటాం. అత్యంత ప్రీతిపదమైన ఆహార పదార్ధాన్ని ఆరోగ్యానికి మంచిదికాదు అని తెలుసుకుని తినడం మానేస్తాము. ఇవన్నీ చిత్తంలో ఇష్టాయిష్టాలలో జరిగే మార్పులే. 

ఆమ్మో, నాన్నో, తోబుట్టువులో, స్నేహితులో, గురువులో ఎవరో ఒకరు మీకిష్టమైన వారు మీకు మంచి చెప్పేవారు ఎప్పుడూ మీతో ఉండాలి. అప్పుడు వారు ఇచ్చే సలహాలు మీకు నచ్చుతాయి. నచ్చిన వాటిపై ఇష్టం కలుగుతుంది. ఇష్టమైన వాటిపై రంధ్రాన్వేషణ జరుగుతుంది. ఆ విషయం మంచిదైతే ఆ రంధ్రాన్వేషణ మీ అభ్యున్నతికి దోహదపడుతుంది. 

బుద్ధి/శృతి - లక్ష్య సాధనలో ఇది అత్యంత కీకాలమైన పాత్ర పోషిస్తుంది. తెలివితేటలు అన్నీ దీనిలోనే ఉంటాయి. నేను, నాది అనే వాటిని కాకుండా విజ్ఞానపరమైన అంశాలపై రంధ్రాన్వేషణ చేసినప్పుడు ఇది అద్భుతాలను సృష్టించగలదు. పుస్తకాలు, పాఠాలు దీనికి మేత. వాటిలో ఉన్న విషయాలను అధ్యయనం చేసి ఇది రంధ్రాలను ఏర్పరచుకుంటుంది. మంచి పుస్తకాలు చదవాలి. అవి ఏ రంగానివైనా కావచ్చు. సాంకేతికపరమైనవి కావచ్చు, గణితం గురించి కావచ్చు, వైద్యము, రాజకీయము, జ్యోతిష్యము, వర్తక వాణిజ్యము ఇలా ఏదైనా కావచ్చు. ఇష్టంతో మనసుపెట్టి చదివితే శృతి ఆ అంశంపై పట్టు సాధిస్తుంది. ఆ తరువాత ఆ తెలివితేటలు బాగా రాణించడానికి ఉపయోగపడతాయి. శ్రుతిలో తెలివితేటలు పుష్కలంగా ఉండటానికి ఒక సులభమైన మార్గం ఉంది. ఏదైనా మనసుకు నచ్చిన అంశం ఎంచుకుని, ప్రతీ రోజు ఆ అంశంపై స్వాధ్యాయం చేయండి. కొన్నాళ్ళకు మీరు ఆ అంశంలో మహాపండితులైపోతారు. ఇదే మానవాళికి కావలసింది కూడా. 

స్మ్రుతి - స్మృతియే శ్రుతికి దారి. వ్యవహారమంతా నడిపించేది ఇదే. దీనికి స్పష్టత అవసరము. లక్ష్యమేమిటి దానిని చేరుకోవడానికి దారి ఏమిటి అనే స్పష్టత ఉన్నపుడు ఇది వ్యవహారం అద్భుతంగా సాగిస్తుంది. పట్టుదల అనే భావాన్ని పుట్టించి దృష్టి మరలకుండా లక్ష్య సాధనవైపే ఉంచుతుంది. స్పష్టత లేనప్పుడు ఇది సందర్భాన్ని భట్టి భావాలను రేకెత్తిస్తుంది. ఉదాహరణకు ఎదురుగా ఆపద పొంచి ఉండి దాని నుంచి ఎలా బయటపడాలో తెలియనప్పుడు భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయం వలన రంధ్రాన్వేషణ వేగవంతమవుతుంది. చూసేవి, వినేవి అన్నీ ఉపాయం వెతికే దిశగా ఆలోచనలను తిప్పుతాయి. 

దీనికి ప్రశాంతత అవసరం. అలజడి తట్టుకోలేదు. అలజడి ఎక్కువగా ఉంటె మనోరధం వణుకుతుంది. అప్పుడు ఆత్మవిశ్వాసం క్షీనిస్తుంది మరియు వ్యవహారం చక్కగా బాగుగా జరగదు. దీని తేజస్సు పెంచాలంటే ప్రాణాయామం అవసరం. ఊపిరి వేగానికి దీని అలజడికి ముడి ఉంటుంది. ప్రాణాయామం ద్వారా ఊపిరి వేగాన్ని నియంత్రిస్తే దీనిలో అలజడి తగ్గి ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. 

జ్ఞానేంద్రియాలు - ఇవి బయటనుండి విషయాలను సేకరించే ద్వారాలు. వీటి ద్వారానే స్మ్రుతి సమస్త జ్ఞానాన్ని సేకరించి పురాణంలో పొందుపరుస్తుంది. వీటికి తన్మాత్రలు ఉంటాయి. కనుక వీటిని పరిమితంగానే వాడుకోవాలి. అంటే కంటికి చూడగలిగిన పరిమితిలో ఉన్న కాంతే చూపించాలి, చర్మాన్ని అది తట్టుకోగలిగిన వాతావరంలోనే ఉంచాలి. వీటికి లౌల్యం ఉంటుంది. అంటే ఏదైనా ఒక తాయిలం రుచి బాగా నచ్చిందనుకోండి, అప్పుడు నాలిక అటువంటి రుచులే ఇంకా కావాలి అంటుంది. ఏదైనా ఒక రంగు బాగా నచ్చితే కన్ను పదే పదే అదే రంగు చూపించమంటుంది. ఈ విషయాలన్నీ చిత్తంలోకి చేరిపోతాయి. అప్పుడు బుద్ధి విచక్షణ కోల్పోతుంది. యావత్ మనోరధం వణకడం మొదలవుతుంది.  అందుకే కామాతురాణాం నభయం నలజ్జా అన్నారు పెద్దలు.

బలవంతంగా ఇంద్రియాలను అణచివేసి కోరికలకు దూరంగా ఉండడం అసాధ్యం. లడ్డూ అంటే చాలా ఇష్టమున్నవాడిని మధుమేహం కారణం చెప్పి బలవంతంగా లడ్డు తిననీయకుండా చేస్తే అతనికి లడ్డూ మీద కోరిక పోదు. లడ్డూ తినాలి అనిపించినప్పుడు ఒకటో/ ఆరో లడ్డూ తినిపించి అప్పుడు ఇది కేవలం క్షణికం. దీని వలన నీకు ఒరిగిన ప్రయోజనం ఏమి లేదు. పైగా నీకు మధుమేహం ఉంది. ఇప్పుడు దీని వలన నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని వివరించాలి. అప్పుడు శృతి మెల్లగా దానిని దూరం ఉంచే ఆలోచన చేస్తుంది. కొంతకాలానికి లడ్డూ పై కోరిక పూర్తిగా చావకపోయినా లౌల్యం అంత బలంగా ఉండదు. 

అసలు ఇంద్రియాలకు లౌల్యం అలవాటు చేయకపోవడమే అత్యంత శ్రేష్టం. ఎందుకంటే ఒకసారి లౌల్యానికి అలవాటుపడిన తరువాత అవి అంత తేలిగ్గా తిరిగి మన మాట వినవు. చాలా సాధన చేయాలి. 

కర్మేంద్రియాలు - ఏ పని చేయడానికైనా ఇవే ఆధారం. వీటికి ఆరోగ్యం అవసరం. మంచి పౌష్టికాహారం తీసుకుని రోజూ యోగాసనాలు లేదా వ్యాయామం చేస్తే ఇవి మంచి చురుగ్గా మెరుగ్గా పని చేస్తాయి. 

Comments

Popular posts from this blog

Preface

Four elements of cognizance

Prayer