గాయత్రీవిద్య


గాయత్రీ

గయాన్ ప్రాణాన్ త్రాయత ఇతి గాయత్రీ

ప్రాణములను రక్షించునది గాయత్రి అని ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. గయలు అంటే ప్రాణాలు అని అర్ధం.

త ద్యత్ప్రాణా వ్రాయతే తద్గాయత్రీ ప్రాణరక్షణ చేయునది గాయత్రి అని బృహదారణ్యకోపనిషత్తు వివరించింది. తస్మాద్దాయంతం త్రాయతే యతః గానము చేయువానిని రక్షించునది. గీయతే తత్త్వమనయా గాయత్రీతి అని శంకర భాష్యం. ఈ మంత్రంలో దైవత్వం గానం చెయ్యబడింది. అందుచేత గాయత్రి అనబడుతుంది.

గాయత్రి మంత్రం రెండు రకాలుగా ఉన్నది.

1. బ్రాహ్మణులకు ఉపనయనకాలంలో ఉపదేశించేది.
2. వేదాలలో నిగూఢమైనది. ఇదే పంచదశి మహామంత్రము.

అందుచేతనే గాయత్రి మంత్రం బ్రాహ్మణులకోసం ఏర్పడగా పంచదశి మహామంత్రం అన్ని వర్ణాలవారికోసం ఏర్పడింది అన్నాడు అగస్త్యమహర్షి ఇంకా చెప్పాలి అంటే గాయత్రీ మంత్రము, పంచదశి మహామంత్రము రెండూ ఒక్కటే. ఈ రెండింటి అర్ధం కూడా ఒక్కటే. శరీరాదులను రక్షించటంచేత గాయత్రి అని, తేజస్వరూపమవటంచేత సావిత్రి అని, వాగ్రూపం కావటంచేత సరస్వతి అని చెప్పబడుతోంది.

సవితృద్యోతనా స్సైవ సావిత్రీ పరికీర్తితా

ప్రపంచాన్ని సృజించి ప్రకాశింపచేస్తుంది. కాబట్టి సావిత్రి అనబడుతోంది.

జాతః ప్రసవితృత్వాన్ వాగ్రూపత్వా త్సరస్వతీ
వాగ్రూపము గలది కాబట్టి సరస్వతి. ఇరవైనాలుగు అక్షరాలతో ఏర్పడ్డ ఛందస్సే గాయత్రి. ఛందస్సులు అనేకరకాలున్నాయి. కాని బ్రహ్మజ్ఞానానికి ద్వారం గాయత్రి ఛందస్సు, ఆ గాయత్రియే సోమరసాన్ని తెచ్చి దేవతల కిచ్చింది. 

ఛాందోగ్యోపనిషత్తులో
ఒకసారి దేవతలంతా గాయత్రి, త్రిష్టప్, జగతి ఛందస్సులను సోమాన్ని తీసుకురమ్మని పంపారు. వీటిలో త్రిష్టప్, జగతి ఛందస్సులు సోమాన్ని తేలేక తిరిగి వచ్చేశాయి. అంతేకాకుండా తిరిగివస్తూ త్రోవలో అలసట కారణంగా తమలోని కొన్ని అక్షరాలను వదలివేశాయి. గాయత్రి మంత్రం సోమం దగ్గరకు వెళ్ళి, దాన్ని రక్షించే వారందరినీ ఓడించి సోమాన్ని తెచ్చి దేవతలకిచ్చింది. తిరిగివచ్చేటప్పుడు త్రోవలో త్రిష్టప్ జగతి ఛందస్సులు వదలివేసిన అక్షరాలను కూడా తీసుకువచ్చింది. ఆ కారణంగా గాయత్రి ఛందస్సు అన్నింటికన్నా గొప్పది అయింది. అంతేకాకుండా ఉదయము మధ్యాహ్నము సాయంకాలము మూడింటిలోనూ వ్యాప్తమై ఉన్నది. బ్రాహ్మణునికి అత్యంతావశ్యకమవటం చేత దాని గౌరవము ఇనుమడించింది. అందుచేతనే గాయత్రిని ఉపేక్షించిన వాడు దేన్నీ పొందలేడు. గాయత్రి ఛందస్సులో 24 అక్షరాలు ఒక్కొక్క పాదానికి ఆరు చొప్పున నాలుగు పాదాలుగా ఉన్నాయి. ఇతర ఛందస్సులలో ఇంకా ఎక్కువ అక్షరాలున్నాయి. కాని వాటన్నింటిలోకి గాయత్రియే శ్రేష్టమైనది. స్థావరజంగమాత్మకమైన ప్రాణి సమూహమంతా గాయత్రియే. వాక్కు - గాయత్రి, సమస్త ప్రాణాలు - గాయత్రి, వాగ్రూపమైన గాయత్రి అందరి పేర్లనూ ఉచ్చరిస్తోంది. కాబట్టి గాయత్రి అందరి పేర్లలోనూ ఉన్నది. ఈరకంగా ప్రాణి జాతి అంతా గాయత్రియే. 

గాయత్రి అంటే ప్రాణులను రక్షించేది అని అర్ధం. ఈ లక్షణాలుగల గాయత్రి ఈ పృథివే తప్ప వేరేకాదు. చరాచరాలన్నీ ఈ భూమిలోనే ఉన్నాయి. అందుచేతనే చరాచరజగత్తునంతటనూ గానంచేస్తూ, పాడుతూ, త్రాణంచేస్తూ - కాపాడుతూ ఉండే గాయత్రియే ఈ భూమి. పృథివీ రూపమైన గాయత్రి శరీరంలో ఉండే పంచభూతాలు, ఇంద్రియాల సమూహము ఒక్కటే. పురుషుని శరీరరూపమైన గాయత్రి, పురుషుని హృదయకమలంలో ఉండే పురుషుడు ఇద్దరూ ఒకటే. ఆ పురుషునిలోనే అంటే గాయత్రిలోనే ప్రాణాలు ప్రతిష్టితమై ఉన్నాయి అని చెప్పబడింది. 

బృహదారణ్యకోపనిషత్తులో గాయత్ర్యోపాసన వివరిస్తూ “ఉపనిషత్తులో చెప్పిన 'భూమి, అంతరిక్ష్యం, ద్యౌః' ఈ మూడు పదాల్లోనూ మొత్తం ఎనిమిది అక్షరాలున్నాయి. ద్యౌః అనే పదంలో దకార యకారాలను రెండు అక్షరాలుగా లెక్కపెట్టాలి. ఇవి మూడులోకాల పేర్లు. గాయత్రి మంత్రానికి పాదానికి ఎనిమిది అక్షరాలున్నాయి.మూడు పాదాలున్నాయి. కాబట్టి మూడు లోకాలు మొదటి పాదం. ఈ రకంగా మూడులోకాలను గురించి తెలుసుకున్నవాడు ముల్లోకాలను జయిస్తాడు.

ఉపనిషత్తులో చెప్పిన 'ఋచ యజాంసి సామాని' అనే మూడుపదాల్లోనూ ఎనిమిది అక్షరాలున్నాయి. ఇవి గాయత్రికి రెండోపాదం. అంటే వేదాలు రెండవ పాదమన్నమాట. ఈ విషయం తెలుసుకున్నవాడు త్రయీవిద్య అనగా వేదవిద్యవల్ల వచ్చే ఫలితాన్ని పొందుతాడు. 

మంత్రంలో చెప్పిన 'ప్రాణ అపాన వ్యానం' అనే దాంట్లోని ఎనిమిది అక్షరాలు గాయత్రికి మూడవపాదం. ఇక్కడ వ్యా అనే అక్షరంలో వకార యకారాలను రెండు అక్షరాలుగా లెక్కపెట్టాలి. ఈ (అంటే ప్రాణాలను నడపడం) విషయం తెలుసుకున్నవాడు సమస్తాన్ని పొందుతాడు.

ఉపనిషత్ మంత్రంలో 'తురీయదర్శి తంపదం' అనేది నాల్గవపాదము. 'దర్శితపదం' అనే పదానికి ఆదిత్యమండలాంతర్గతుడైన పురుషుడు కనిపిస్తున్నాడని అర్ధం. అంటే అన్ని లోకాలకు పైన ఆధిపత్యం స్థాపించి ప్రకాశిస్తున్నాడు. ఈ రకంగా గాయత్రిలో నాల్గవపాదం తెలుసుకున్నవాడు కీర్తితో ప్రకాశిస్తాడు. తురీయపదం సత్యంలో ప్రతిష్టితమై ఉన్నది. నేత్రమే సత్యం. ఏదైనా ఒక విషయాన్నినేను చూశాను. నేను విన్నాను అని చెప్పినప్పుడు చూసినదాన్నే నమ్మటం జరుగుతుంది. అందుచేతనే నేత్రం సత్యం. తురీయపాదానికి ఆశ్రయమైన సత్యం బలంలో ప్రతిష్ఠితమై ఉన్నది. అందుకనే సత్యంకన్న బలం ప్రకాశమైనది. ప్రాణమే ఆ బలం. త్రిపద ా గాయత్రి ప్రాణాలను రక్షిస్తుంది. గాయత్రి ప్రాణంలో ప్రతిష్టితమై ఉన్నది. వాగాది ప్రాణాలను రక్షించేది గాయత్రి. గానము చేసే వాడిని రక్షించేది గాయత్రి. ఉపాసనచేసే వాణ్ణి రక్షించేది గాయత్రి. ఉపనయన సమయంలో వటువుకు త్రిపదగాయత్రి ఉపదేశిస్తారు.

అస్య శ్రీ గాయత్రీ మహామంత్రస్య విశ్వామిత్ర ఋషిః | గాయత్రీఛందః| శ్రీ సవితాదేవతా| యంబీజం| ఈం శక్తిహ్| ణం కీలకం| జపే వినియోగః 

న్యాసము : 
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే| వరేణ్యం విశ్వాత్మనే| భర్గోదేవస్యరుద్రాత్మనే| ధీమహి సత్యాత్మనే| ధియో యోనః జ్ఞానాత్మనే| ప్రచోదయాత్ సర్వాత్మనే || 

ధ్యానము:
ముక్తా విద్రుమ హేమ నీల దవాలచ్చాయై ర్ముఖై స్త్రీక్షణైః
యుక్తా మిందునిబద్ధరత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం | 
గాయత్రీమ్ వరదాభయాం కుశకాశా శ్ముభ్రం కపాలం గదాం 
శంఖం చక్ర మధా రవిందయుగళామ్ హస్తయ్ ర్వహంతీమ్ భజే || 

మంత్రము : 

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం || భర్గోదేవస్య ధీమహి |
ధియోయోనః ప్రచోదయాత్ |

ఇది త్రిపదగాయత్రి. అయితే కొన్ని శాఖలవారు అనుష్టుప్ ఛందస్సులో ఉండే గాయత్రిని ఉపాసిస్తారు.
తత్సవితు ర్వృణీ మహే ౹ వయం దేవస్య భోజనం | శ్రేష్ఠం వై సర్వధాతమమ్ |
తురంగ భగస్య ధీమహి
వాక్కే అనుష్టుప్. వాక్కే శరీరంలో ఉండే సరస్వతి. కాబట్టి వాక్స్వరూపమైన సరస్వతిని వీరికి ఉపదేశిస్తున్నామని వీరికి నమ్మకం. గాయత్రి ఉపాసకుడు ఆవులు, గుర్రాలు, భూమి దానంగా తీసుకున్నా దానివల్ల కలిగే దోషం మొదటి పాదాన్ని జపిస్తే పోతుంది. వేదవిద్యతో సమానంగా దానం తీసుకున్నా ఆ దానం వల్లవచ్చే పాపం మంత్రంలోని రెండవపాదాన్ని జపం చేస్తే పోతుంది. “లోకంలో ఉన్న ప్రాణాలన్నీ దానం తీసుకున్నా, ఆ పాపం మూడవపాదం జపం చేస్తే పోతుంది. అంటే గాయత్రిమహిమ చాలా గొప్పది” అని చెప్పబడింది.

శుద్ధ గాయత్రీ ప్రత్యక్షరం బ్రహ్మైక్య బోధితా
శుద్ధగాయత్రిలోని ప్రతి అక్షరము పరబ్రహ్మను గురించే బోధిస్తున్నది. అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని వివరిస్తుంది.

మహా మంత్రస్య చాపస్య స్థానే స్థానే పదే పదే
గూడో రహస్య గర్భేన | న్తో ప దేశ సముచ్ఛయః |
గాయత్రీ మహామంత్రంలోని ప్రతి అక్షరంలోనూ, ప్రతిస్థానమందు మహా రహస్యమున్నది.
గాయత్రీ మంత్రాన్ని ఉపాసన చేసేవారికి ఇహపరసుఖాలు పూర్తిగా లభిస్తాయి.
హృదయపద్మమందు అధిష్టించి ఉన్న గాయత్రిని ఉపాసన చేసేవారు ధర్మాధర్మవిముక్తులై ముక్తిని పొందుతారు. గాయత్రీమంత్రానికి 24 అక్షరాలున్నాయి. ప్రజాపతి సంవత్సర స్వరూపుడు. అతడే కాలస్వరూపుడు. సంవత్సరానికి 12 మాసాలు. మాసానికి రెండు పక్షాలు. ఈ రకంగా  24 పక్షాలుంటాయి. ఆ 24 పక్షాలే గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. సంవత్సరానికి
మూడుకాలాలు.

1. వేసవి కాలము 2. వర్షాకాలము 3. శీతాకాలము. వీటి స్వరూపంగానే గాయత్రీ మంత్రము మూడు పాదాలుగా ఉన్నది. మంత్రంలోని మూడుపాదాలు 1. భూలోకం 2. భువర్లోక 3. సువర్లోకాలకు ప్రతీక. అందుచేతనే ఆ పాదాలను లోకాలకు అన్వయించి ధ్యానించాలి.

1. మొదటిపాదము : భూలోక సమన్వయము. భౌతికమైన సృష్టిరూపంలో ధ్యానం చెయ్యాలి.
2. రెండవ పాదము : భువర్లోక సమన్వయము. అంటే శక్తి మయాత్మకరూపంలో ధ్యానం చెయ్యాలి.
3. మూడవ పాదము : సువర్లోక సమన్వయము. అంటే ప్రజ్ఞామయాత్మక దృష్టితో ధ్యానం చెయ్యాలి.

ఈ విధంగా ధ్యానం చేసేటప్పుడు ముందు ద్రవ్యాత్మక లోకానికి అధిష్టాన దేవతలయిన అష్టవసువులు అనుగ్రహం కలుగుతుంది. ఆ తరువాత శక్తి మయాత్మక లోకానికి అధిష్టాన దేవతలయిన ఏకాదశరుద్రుల అనుగ్రహం కలుగుతుంది. అటుపైన ప్రజ్ఞామయాత్మకలోకానికి అధిష్టానదేవతలయిన ద్వాదశాదిత్యుల అనుగ్రహం కలుగుతుంది. గాయత్రీ మంత్రంలోని ప్రతి అక్షరానికి ప్రత్యేకమైన అర్ధం ఉన్నది. ఇప్పుడా అర్ధాన్ని వివరిస్తున్నాం.

ఓమ్ - బ్రహ్మ, భూః - ప్రణవస్వరూపము, భువః -దుఃఖనాశనము, స్వః- సుఖస్వరూపము, తత్ - ఆ 
సవితుః -  తేజస్సుచే ప్రకాశించు, దేవస్య - దేవుని యొక్క, వరేణ్యం - శ్రేష్ఠమైన, భర్గః - పాపనాశనమైన తేజమును, ధీమహి - ధ్యానింతును, యః - ఏదైతే, నః - మా యొక్క, ధియః - బుద్ధులను, ప్రచోదయాత్ - ప్రేరేపించునో, ఆ తేజస్సును ధ్యానింతును.

పంచదశీ మహామంత్రము గాయత్రీమంత్రము రెండూ ఒక్కటే అని చెబుతూ భాస్కరరాయలవారు తమ వరివశ్యా రహస్యంలోని 60, 61, 63 శ్లోకాలలో పంచదశీ మహామంత్రానికి గాయత్రి మంత్రార్థం నిరూపించారు. 
          పంచదశీ మహామంత్రంలోని కకారానికి సర్వజగత్తునూ సృష్టించాలనే కోరిక గల బ్రహ్మ అని అర్ధం. గాయత్రీ మంత్రంలోని మొదటి మూడుపదాలకు బ్రహ్మ అని అర్ధం. పంచదశిలో రెండవ అక్షరమైన ఏ కారానికి గాయత్రీ మంత్రంలోని సవితుః - శ్రేష్టమైన అని అర్ధం. మూడువ అక్షరమైన ఈ కారము గాయత్రి మంత్రంలోని భర్గోదేవస్యధీ అయిన పరమేశ్వరుణ్ణి సూచిస్తుంది.

          ఈ రకంగా శ్రీవిద్యలోని ప్రధమకూటమిలోని అక్షరాలు గాయత్రీమంత్రంలోని ప్రధమపాదంచే తెలియబడు జగత్కారణభూతులైన కామేశ్వరీ కామేశ్వరులను చెబుతోంది. వారిద్దరి సామరస్యమే పరమశివుడు. అతని పరిణామమే ఈ జగత్తు. అతడే సమస్త బుద్ధులకు ప్రేరకుడు. త్రిగుణాతీతుడు. ప్రణవస్వరూపుడు.

             గాయత్రీ మంత్రంలోని మహి అనే శబ్దము శ్రీవిద్యలోని ల కారాన్ని సూచిస్తున్నది. ల కారమనేది పృథివీ బీజం. కాబట్టి దాని నుంచి పంచభూతాత్మకమైన జగత్తు తెలుస్తుంది. ఈ జగత్తంతా పరమేశ్వరునివల్ల సృష్టించబడింది. ఆ పరమేశ్వరుని ప్రతిబింబమే మహాత్రిపురసుందరి.

గాయత్రీమంత్రంలోని చివరి రెండుపాదాల అర్ధం శ్రీవిద్యలోని హ్రీం కారముచే సూచించబడుతుంది. ఈ రకంగా గాయత్రి, పంచదశి మహామంత్రాల అర్ధం ఒక్కటే. దేవీ భాగవతంలోని 12వ స్కంధంలో గాయత్రీమంత్రాన్ని వివరించారు. ఈ మంత్రానికి 24 మంది ఋషులు, 24 ఛందస్సులు, 24 మంది దేవతలు, 24 శక్తులు, 24 రంగులు, 24 వర్ణతత్త్వాలు 24 వర్ణముద్రలు చెప్పబడ్డాయి. వాటిని కూడా ఇక్కడ ఉటంకిస్తున్నాం.

గాయత్రీ మంత్రానికి 24 మంది ఋషులున్నారు. వారు
1. వామదేవుడు 2. అత్రి. 3. వశిష్ఠుడు 4. శుక్రుడు 5. కణ్వుడు 6. పరాశరుడు 7. విశ్వామిత్రుడు
8. కపిలుడు 9. శౌనకుడు 10. యాజ్ఞవల్క్యుడు 11. భరద్వాజుడు 12. జమదగ్ని 13. గౌతముడు
14  అగస్త్యుడు 15 కౌశికుడు 16  వ్యాసుడు 17. వత్సుడు 18 పులత్స్యుడు 19 మాండూకుడు
20 ముద్గలుడు 21 దుర్వాసుడు 22నారదుడు 23 లోమశుడు 24. కశ్యపుడు

గాయత్రీ మంత్రానికి 24 ఛందస్సులున్నాయి. అవి
1. గాయత్రి 2. శక్వరి 3 ఆకృతి 4 ఉష్ఠిక్ 5. అతిశక్వరి 6. అనుష్టుప్ 7. ధృతి 8. సంకృతి 9.బృహతీ 10 అతిధృతి 11. అక్షరపంక్తి 12. త్రిష్టుభము 13. విరాట్ 14. భూః 15 పంక్తి 16 ప్రసారపంక్తి 17 ర్భువః 18 జగతి 19 స్వః 20 అతిజగతి 21 ప్రకృతి 22. జ్యోతిష్మతి 23 వికృతి 24. కృతి 

గాయత్రీ మంత్రానికి దేవతలు 24 మంది ఉన్నారు. వారు
1. భగుడు 2. మైత్రావరుణుడు 3. ప్రజాపతి 4 యముడు 5. వైశ్వదేవుడు 6. చంద్రుడు 7. గణేశుడు 8. మాతృకలు 9. ఈశానుడు 10. త్వష్ట 11. విష్ణువు 12. సవిత 13. పూష 14 వసువు 15. ఆదిత్యుడు 16. ఇంద్రాగ్ని 17 రుద్రుడు 18. బృహస్పతి 19. వాయువు 20. కుబేరుడు 21 మైత్రావరుణుడు 22. వామదేవుడు 23. అశ్వనీకుమారులు 24.అగ్ని
ఈ దేవతలలో మైత్రావరుణుడు పేరున్నవారు ఇద్దరున్నారు. అంతేకాని పొరపాటుకాదు.

గాయత్రీమంత్రానికి 24 శక్తులున్నాయి. అవి
1. వామదేవి 2. కాంతా 3. సూక్ష్మా 4. ప్రియా 5. విశ్వయోని 6. సరస్వతీ 7. విజయా 8. విశ్వభద్ర 9. విద్రుమా 10. వశా 11. విలాసినీ 12. విశాలేశా 13. పద్మాలయా 14. ప్రభావతి 15. వ్యాపినీ 16. పరాశోభా
17 జయా 18. విమలా 19. భద్రా 20 శాంతా 21 తమోపహారిణీ 22. త్రిపదా 23. దుర్గా 24. సత్యా 

గాయత్రీ మంత్రానికి వర్ణాలు (రంగులు) 24 అవి.
1. సంపంగి 2. పద్మరాగము 3. పసుపు 4. అవిసె 5. ఇంద్రనీలమణి  6. పాలమిశ్రణము 7. పగడము
8. ముత్యము 9. సూర్యకాంతి 10. స్పటికము 11. కుంకుమ 12. చిలుకతోకరంగు 13. పద్మపుష్పము
14. కాటుక 15. శతపత్రకాంతి 16. బాలాదిత్యుడు 17 రక్తము 18. కౌతకీపుష్పము 19. శంఖకుందేలు
20. వైడూర్యము 21. మల్లికాకుసుమము 22. పగడము 23. కరవీరపుష్పకాంతి 24. తేనె

గాయత్రీ మంత్రానికి 24 వర్ణతత్త్వములున్నాయి. అవి
1. నేల 2 చక్షువు 3. నీరు 4. చర్మము 5. కాంతి 6 వాక్కు 7. శోత్రము 8 గాలి 9. పాణి, పాదము 10. ప్రాణము 11. ఆకాశము 12. పాయు 13. అపానము 14.గంధము 15.వ్యానము 16. రసము 17. ఘ్రాణము 18.ఉదానము 19. రూపము 20.జిహ్వా 21.సమానము 22. స్పర్శ 23. శబ్దము 24. ఉపస్థ

గాయత్రీ మంత్రానికి 24 రకాల ముద్రలున్నాయి. అవి.
1. సుముఖము 2. షణ్ముఖము 3 ముష్టికము 4. సంపుటము 5. అధోముఖము 6. మత్స్యము 7. వితతము 8. వ్యాపకాంజలికము 9. కూర్మము 10.విస్తృతము 11. శకటము 12. వరాహము 13. ద్విముఖము 14. యమపాశము 15. సింహక్రాంతము 16. త్రిముఖము  17. గ్రధితము 18. మహక్రాంతము 19. చతుర్ముఖము 20. షణ్ముఖోన్ముఖము 21. ముద్గరము 22. పంచముఖము 23. ప్రలంబము 24. పల్లవము

అయితే ముఫైరెండు అక్షరాలు గల గాయత్రీ మంత్రానికి ముద్రలు ఈ విధంగా ఉంటాయి.

1. త్రిశూలము 2. లింగము 3. యోని 4. సురభి 5. అక్షమాలా 6. అంబుజము

ఈ రకంగా ఉన్న గాయత్రి మంత్రం బ్రహ్మ క్షత్రియ, వైశ్యులందరిచేత జపించబడుతోంది. అయితే
ఓంకారవ్యాహృతిపూర్వాం గాయత్రీం బ్రాహ్మణో జపేత్
త్రిష్టుభం చైవ రాజన్యో జగతీం వైశ్య ఏవ చ.

ఓం కారవ్యాహృతి పూర్వకమైన గాయత్రిని - బ్రాహ్మణులు
త్రిష్టుప్ ఛందస్సులో - క్షత్రియులు
జగతీ ఛందస్సులో - వైశ్యులు ఈ మంత్రాన్ని జపిస్తారు.

అంతేకాకుండా మంత్రశాస్త్రంలో ప్రతి మంత్రానికి గాయత్రి ఉంటుంది.

కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిిః ప్రచోదయాత్ |
మహాదేవ్యై చ విద్మహే | విష్ణుపత్యైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||
గాయత్రీమంత్రం అత్యంత మహిమోపేతమైనది

పూర్వకాలంలో ఒకసారి అనావృష్టి వచ్చింది. దాదాపుగా పదిహేను సంవత్సరాలు వర్షపు చుక్కైనా కురవలేదు. పాడిపంటలు లేవు. చెట్లు చేమలు కూడా అంతరించి పోయాయి. భరించలేని కరువు. పశువులు గడ్డిలేక చచ్చిపోతున్నాయి. పసిపిల్లలకు పాలులేవు. ఆకలికి తాళలేక కొందరైతే మృతకళేబరాలను పీక్కుతినే స్థితికి వచ్చారు. ఇంతదాకా ఎందుకు పిల్లలకు పాలు ఇవ్వలేక, వారిని పెంచలేక గొంతు పిసికి చంపేసిన వారు కూడా ఉన్నారు. మొత్తం మీద ఘోరకలి విలయతాండవం చేస్తోంది. ఆ రోజుల్లో కొంతమంది పండితులు ఒకచోట చేరి ఈ దుర్భర స్థితి నుంచి తప్పించుకోవటానికి మార్గం ఏమిటా అని ఆలోచించసాగారు. అప్పుడు వారికి గౌతముడు గుర్తు వచ్చాడు. గౌతముడు ఒక మహర్షి. మహాతపస్సంపన్నుడు. పరదేవతను ఆరాధిస్తూ ఉండేవాడు. ఆవిడ యొక్క కరుణవల్ల విత్తనాలు చల్లగానే అవి మొలకెత్తి ఫలితాన్ని ఇచ్చేటట్లుగా వరం పొందాడు. కాబట్టి ఇప్పుడు మనమంతా గౌతముడిని శరణువేడితే ఆ మహర్షి మనలను కరుణిస్తాడు అని ఆలోచించి గౌతముడి ఆశ్రమానికి ప్రయాణమయ్యారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఇంతమంది పండితులను చూసి, వారికేదో ఆపద వచ్చిందని గ్రహించి, వారిని ఆహ్వానించి ఆతిధ్యమిచ్చాడు గౌతముడు. ఆ తరువాత జరిగిన విషయం తెలుసుకుని, ప్రజలు ఆకలిదప్పులకు అల్లాడుతున్నారన్నమాట విని విచారించి ఆపరదేవతను ప్రార్ధించాడు.

నమో దేవి ! మహావిద్యే ! వేదమాతః ! పరాత్పరే !
వ్యాహృత్యాది మహామంత్రరూపే ! ప్రణవరూపిణి !
సామ్యావస్థాత్మికే ! మాతః ! నమో హ్రీంకార రూపిణి
స్వాహా స్వధా స్వరూపే ! త్వాం నమామి సకలార్ధదామ్
భక్తకల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం
కుర్యాతీత స్వరూపాం చ సచ్చిదానంద రూపిణీం
సర్వవేదాంత సంవేద్యాం సూర్యమండల వాసినీం
ప్రాతర్బాలాం రక్తవర్ణాం మధ్యాహ్నే యువతీం పరాం
సాయాహ్నే కృష్ణవర్ణాం తాం వృద్ధాం నిత్యం నమా మ్యహమ్ ||

ఆ దేవత మహిమవల్ల వచ్చిన వారందరికీ నివాసం ఏర్పాటుచేసి, గతంలో దేవత తనకిచ్చిన వరము ద్వారా వారందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాడు. ఇంతకాలం అన్న పానాదులు లేక, అవి ఎలా ఉంటాయో కూడా మరచిపోయిన వాళ్ళకి ఆ పరదేవత దయవల్ల పంచభక్ష్యాలతో సమృద్ధిగా ఆహారం దొరికింది. ఆ ఆనందానికి తట్టుకోలేక అన్నదానం చేసి తమ ప్రాణాలని నిలబెట్టిన గౌతముణ్ణి వేనోళ్ళ కొనియాడారు. ఆ పరమేశ్వరిని పరిపరివిధాల స్తుతించారు. పండితులంతా యజ్ఞయాగాలు చెయ్యనారం భించారు. ఆశ్రమానికి ఎటు చూసినా నూరు యోజనాల వరకు ఆశ్రితులున్నారు. అందర్నీ సంరక్షిస్తున్నాడు గౌతముడు.

కొంతకాలానికి నారదుడు వచ్చి గౌతముడు చేస్తున్న పనికి మెచ్చుకుని “మహర్షీ ! ఆపదకాలంలో వీళ్ళని ఆదుకున్నావు. వారికోసం ఆ పరాశక్తి ఇచ్చిన వరం ఉపయోగించటం వల్ల నీశక్తి మరింతగా పెరిగింది. తనకున్న శక్తితో పదిమందికీ ఎవరైతే ఉపకారం చేస్తారో వారి శక్తి ద్విగుణీకృత మౌతుందని చెప్పబడింది. ఇప్పుడు నీకూ అదే జరిగింది. ఇంద్రాది దేవతలంతా నువు చేస్తున్న పనిని వేనోళ్ళ కొనియాడుతున్నారు” అన్నాడు. ఈ మాటలు విన్న పండితులకు ఈర్ష్య కలిగింది. గౌతముడికి ఇంత పేరు రావటం వాళ్ళు సహించలేక పోయారు. ఎలాగైనా సరే గౌతముడి ప్రతిష్ఠకు మచ్చ కలిగించాలి అనుకున్నారు.

వానలు పడటం మొదలు పెట్టాయి. క్రమంగా నేల చల్లబడింది. ఏరులు పారాయి. నదులు పొంగాయి. విత్తనాలు మొలకెత్తుతున్నాయి. పండితులు కూడా వెళ్ళిపోవటానికి సన్నద్ధమౌతూ మాయాగోవును ఒకదాన్ని సృష్టించారు. అది వచ్చి ఆశ్రమ ప్రాంగణంలోని పంటను, ఆహారాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టింది. అది చూసిన గౌతముడికి కోపం వచ్చింది. ఆవును కొట్టటం ఇష్టం లేక అదిలించాడు. అంతే ఆ అదిలింపుకు మాయాగోవు కింద పడి చచ్చిపోయింది. ఇదంతా చాటునుంచి చూస్తున్న పండితులు “గౌతముడు గోవును చంపాడు. గోహత్య మహాపాతకం. ఇంక ఇతడి ఇంట భోజనం చెయ్యటం కూడా పాపం. మేం వెళ్ళిపోతున్నాం” అని చెప్పి బయలుదేరారు. అది మాయ అని తెలియక గౌతముడు వారిని బ్రతిమాలాడు. ఈ పాపం పోయే ఉపాయం చెప్పమన్నాడు. అప్పుడు వారు గౌతముడికి అసాధ్యమయ్యేపని ఏదా ? అని ఆలోచించి చివరకు గంగను తెచ్చి గోవుమీద ప్రవహింపచేస్తే ఈ పాపం పోతుందన్నారు.

గౌతముడు చాలా సంవత్సరాలు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై గౌతముడి కోర్కె ప్రకారం తన జటాజూటం నుంచి రెండు బొట్లు విదిల్చాడు. అంతే చచ్చిన గోవు లేచి నుంచుంది. ఈరకంగా గౌతముని చేత తేబడింది కాబట్టి గౌతమి అనీ, గోవును బ్రతికించటానికి వచ్చింది కాబట్టి గోదావరి అనీ ఆనదికి పేరు వచ్చింది. ఆవు లేచి నుంచోగానే 'గౌతముడు మాయాగోవును బ్రతికించాడు' అని గేలిచేశారు పండితులు. దివ్య దృష్టితో అసలు విషయం తెలుసుకున్న మహర్షి వారిమీద కోపించి “ఇక నుంచీ గాయత్రీ జపం మీకు నిష్పలమవుతుంది. వేదాధ్యయనం, యజ్ఞకర్తవ్యం మీకు ఉండవు. మీరంతా ధర్మహీనులు, నీతిదూరులు అయి భ్రష్టుపట్టిపోతారు. వావీ వరుసాలేకుండా పశువుల్లా ప్రవర్తిస్తారు. తరతరాలకు మీగతి ఇంతే” అని శపించాడు. చేసిన తప్పు క్షమించమని పండితులంతా ప్రాధేయపడగా ద్వాపరయుగంలో
పరమేశ్వరి అంశతో యదువంశంలో నందగోవుని ఇంట శ్రీకృష్ణుడు పుడతాడు. అతని
జన్మతో మీకు శాపవిమోచన మవుతుంది అన్నాడు. ఈ రకంగా పండితులు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి, పరమేశ్వరి దయవల్ల మళ్ళీ గాయత్రీ అనుష్ఠానం చేసి బ్రహ్మతేజస్సును పొందారు. గాయత్రి జపం చేసినవాడు బ్రహ్మతేజస్సుతో వెలుగొందుతాడు.

వ్యాహృతి

వ్యాహృతి అంటే - శ్రీతేంద్రియానికి తెలిసే స్థూలమగు రూపము. ఉచ్చరించబడి వ్యాప్తి చెందేది. భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అనేవి సప్తవ్యాహృతులు. వీటిలో

భూః -సన్మాత్ర
భువః -స్వరము
సువః- సుఖస్వరూపము
మహః- సర్వాతిశయము గలది, సర్వానికి కారణమైనది
తపః- పాలనస్వరూపము గలది
సత్యము - బ్రహ్మము

తైత్తిరీయోపనిషత్తులో, శిక్షావల్లిలోని ఐదవ అనువాకంలో పరబ్రహ్మకు అంగభూతాలయిన వ్యాహృతుల ఉపాసన చెప్పబడింది. వ్యాహృతులు అంటే కర్మలలో ఉపయోగించేవి అని అర్ధం. భూః, భువః, సువః అనేవి మూడు వ్యాహృతులు.


మహాచమస్యుడనే మహర్షి తపస్సు చేసి మహః అనే నాల్గవ వ్యాహృతిని కనిగొన్నాడు. మహః అనేదే బ్రహ్మము. మహః అనేది శరీరమైతే భూః, భువః, సువః అనేవి అంగాలు. అంగాలకు ఉనికి లభించినట్లుగా, మహః వల్ల మిగిలిన వాటికి ఉనికి లభిస్తోంది. వ్యాహృతులు బ్రహ్మకు అంగాలు కాబట్టి వీటి ఉపాసన చెప్పబడింది. వ్యాహృతుల ఉపాసన నాలుగురకాలు.

1. లోకదృష్టితో ఉపాసన :

భూః -భూలోకాన్ని దృష్టిలో ఉంచుకుని
భువః -అంతరిక్ష్యాని దృష్టిలో ఉంచుకుని
సువః - స్వర్గలోకాన్ని దృష్టిలో ఉంచుకుని
మహః - ఆదిత్యలోకాన్ని దృష్టిలో ఉంచుకుని
ఉపాసన చెయ్యాలి. దీనితో లోకాలన్నీ సూర్యుని వెలుగుతో ప్రకాశమవుతాయి.

2. దేవదృష్టితో ఉపాసన :

భూః - అగ్ని దృష్టితో
భువః -ఆదిత్య దృష్టితో
సువః - వాయు దృష్టితో
మహః - చంద్రుని దృష్టితో
ఉపాసన చెయ్యాలి. అన్ని తేజస్సులు చంద్రునిచే పూజ్యములు

3. వేద ధృష్టితో ఉపాసన :

భూః -ఋగ్వేదము
భువః -సామవేదము
సువః - యజుర్వేదము
మహః - ఓంకారము

ఓంకారాన్ని మొదట, చివర చేర్చటం వల్లనే వేదాలు పూజనీయమవుతున్నాయి.

4. ప్రాణదృష్టితో ఉపాసన :

భూః -ప్రాణవాయువు
భువః -అపానవాయువు
సువః - వ్యానవాయువు
మహః -అన్నము
గా భావించి ఉపాసన చేయాలి. లోకంలో ప్రాణులన్నీ అన్నం చేతనే వృద్ధి పొందుతున్నాయి. ఈ రకంగా ఈ 16 వ్యాహృతులు హిరణ్యగర్భునికి అంగాలు. వీటిని తెలుసుకోగలిగినవాడే బ్రహ్మను గురించి తెలుసుకోగలుగుతాడు.

సంధ్యా


“సంధ్య అంటే సూర్యుని చేరిన బ్రహ్మ. ఆత్మ యొక్క అంశలైనటువంటి బ్రహ్మాది సకలభూతములచేత బ్రహ్మకు భిన్నముకానటువంటి సంధ్య ఉపాసించబడుచున్నది. దానికి నేను దాసుడను" అని మహాభారతంలో చెప్పబడింది. అటువంటి సంధ్య కు వేరైనది కాదు కాబట్టి మన సంధ్యా నామంతో పిలువబడుతోంది.

'బ్రహ్మది ఆకారభేదం చేత వేరుగా ఉన్నది. ఐనప్పటికీ కర్మకు సాక్షియై ప్రకాశించే ఈశ్వరశక్తియే సంధ్య' అని భారధ్వాజ స్మృతిలో చెప్పబడింది.

గాయత్రీ మంత్రము నాల్గవపాదముతో కూడినదై సంధ్యారూపిణి అవుతున్నది అని ఆగమాలు చెబుతున్నాయి. అందుచేత సంధ్యాకాలంలో ఉపాసించతగిన దేవత సంధ్య.

కాలికావురాణంలో సంధ్యాదేవి బ్రహ్మ యొక్క కుమార్తె అని చెప్పబడింది.

భగవతీపురాణంలో బ్రహ్మ మానసపుత్రిక అయిన సంధ్య తపస్సు చేసి శరీరాన్ని వదిలి వశిష్ఠుని భార్య అరుంధతిగా జన్మించింది అని చెప్పారు. చిఛక్తి స్వరూపిణి అయిన పరమేశ్వరియే సంధ్య.

సంధ్యాదేవతయే గాయత్రి, సావిత్రి, పరమేశ్వరి. ఈ సంధ్యా దేవత సంధికాలమున ఉపాసించబడుతుంది. సూర్యుడు ఉదయించకముందు, నక్షత్రాలు అస్తమించకముందు కాలము ఉదయసంధ్య. అలాగే సూర్యుడు అస్తమించాడు. కాని నక్షత్రాలు పూర్తిగా లేవు. అది సాయంసంధ్య. ఇవి సంధ్యావందన కాలములు. ఈ సమయంలో ధ్యానించబడేదే సంధ్య. సూర్యుడి యందలి చైతన్యశక్తియే సంధ్య. ఈ దేవిని ఆజ్ఞాచక్రస్థానంలో ధ్యానం చెయ్యాలి.


పంచకోశాలలోను మనోమయకోశము సంధికోశము అదే సంధ్యాస్థానము అని చెప్పబడుతోంది.

సంధ్యాస్నానం జపో హోమో దేవతానాం చ పూజనం |
ఆతిధ్యం వైశ్వదేవం చ షట్కర్మాణి దినే దినే |

సంధ్యావందనము, జపము హోమము, దేవతాపూజ, అతిధిపూజ వైశ్వదేవము ఈ ఆరు ప్రతినిత్యము చేయవలసినవి.

సంధ్య అనగా ఒక సంవత్సరము వయసు గల బాలిక. ఏకవర్షాభవేత్సంధ్యే అని చెప్పబడింది.

ద్విజబృందనిషేవితా

ద్విజులు అంటే రెండు జన్మలు గలవారు. బ్రహ్మక్షత్రియవైశ్యులు. వీరిచే పూజించబడునది. రేణుకాపురాణంలో “సంధ్యాదేవి దేవతలచేత, ద్విజులచేత మహాత్ములచేత కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, సర్వకాల సర్వావస్థలయందు పూజించబడుతుంది" అని చెప్పబడింది.

సంధ్యాదేవి యొక్క ప్రాముఖ్యతనే ఇంకా వివరిస్తున్నారు. బ్రహ్మక్షత్రియ వైశ్యులు త్రికాలములందు సంధ్యాదేవిని ఉపాసనచేస్తారు. కాబట్టి ద్విజబృందనిషేవితా అనబడుతుంది. వీరికి ఉపనయన సంస్కారము జరుగుతుంది. ఆ తరువాతనే బ్రహ్మవిద్యకు అర్హత వస్తుంది. కాబట్టి బ్రహ్మవిద్యకు అర్హత పొందటానికి సంధ్యాదేవిని ఉపాసించాలి.

అసలు బ్రహ్మక్షత్రియవైశ్యులను ద్విజులని ఎందుకంటారు? శూద్రులను ఎందుకలా పిలవరు? రెండు జన్మలు ఎలా వస్తాయి? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈ క్రింద వివరణలో తెలుసుకోండి.

జన్మచే అందరూ శూద్రులే. శూద్రులకు ధర్మాధర్మ విచక్షణ అంతగా తెలియదు. బాల్యంలో మనమందరం అంతే కదా! అందుకే జన్మచే అందరూ శూద్రులే. బాల్యావస్థ పూర్తి అయ్యే సమయానికి (అంటే 8 ఏళ్లు) మనిషిలో కొంత పరివర్తన మొదలవుతుంది. లింగ భేదం అవగతమవుతుంది. పిల్లలు సిగ్గు బిడియం వంటివి ప్రదశించడం జరుగుతుంది. సభ్య సమాజంలోను, కుటుంబంలోను వారి స్థానం ఏమిటో తెలుసుకుంటారు. అంటే క్రమేపి నేను ఫలానా అనే గుర్తింపు బలపడి తద్వారా నేను అనే అహంకారం వేళ్లూనుకొని విస్తరితోంది అన్నమాట.

మానుషలందరికి పూర్వ జన్మ వాసనలు ఉంటాయి. ఈ వాసనలు మూడు రకాలు. అవి 1.జ్ఞాన 2.దేహ 3.లౌక్య. మనం చేసే ప్రతీ కర్మలోను ఈ వాసనల ప్రభావం ఉంటుంది. అంతే కాదు. ఆ కర్మ వలన ఈ వాసనలు మరింత బల పడుతూ ఉంటాయి. ఇదే గమ్మత్తు. వాసన వలన కర్మ మళ్ళీ తిరిగి కర్మ వల్ల వాసన ఒకదానిని ఒకటి ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. ఇలా ఒక జన్మ గడిచిన తరువాత, చేసిన కర్మల యొక్క వాసనలు మళ్ళీ తరువాతి జన్మలో కొనసాగుతూ ఉంటాయి. వాసన నీడ అయితే కర్మ శరీరం. కర్మ అనే ఈ శరీరానికి అహంకారం ప్రాణం. ప్రాణం లేనిచో శరీరం లేదు. శరీరం లేనిచో నీడ లేదు. వీటికి ఇటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది. అందరూ దొంగలే అందుకే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు.

బాల్యావస్థ దాటిన పిదప క్రమేపి అహంకారం బలపడుతుంది అని మనం పైన చెప్పుకున్నాం. అందుకని తల్లిదండ్రలు ఆ పిల్లవాడికి గురువులచే ఉపనయయం చేయిస్తారు. ఆ తంతులో గురువులు అతని వాసనా బలాన్ని పసికట్టి తల్లి దండ్రులకు చెబుతారు. గురువుల ఉపదేశము బట్టి తల్లిదండ్రులు పిల్లవాడి భవిష్యత్తు కొరకు ప్రణాళిక వేసుకుంటారు.

బ్రాహ్మణుడిగా ప్రసిద్ధికెక్కాలంటే బలమైన జ్ఞాన వాసన కలిగి ఉండాలి. వాక్కు ద్వారా దీన్ని పసిగడతారు. అందుకే బ్రాహ్మణులు విష్ణువు ముఖము నుంచి వచ్చారు అని అంటారు. ఈ జ్ఞాన వాసనతో బ్రాహ్మణులు గురువుల వద్ద శిష్యరికం చేసి సకల శాస్త్రాలు అభ్యసిస్తారు. లోకానికి ధర్మ బోధ చేస్తారు. యజ్ఞ యాగాది క్రతువులు, పూజాది కర్మలు నిర్వహిస్తారు. తాము శ్రమించి సంపాదించిన వేద విజ్ఞానాన్ని లోకానికి అందిస్తారు.

క్షత్రియడిగా ప్రసిద్ధికెక్కాలంటే బలమైన దేహ వాసనా, కొంత లౌక్య వాసనా ఉండాలి. ఇది పిల్లవాడి భుజ బలం, గుండె ధైర్యం, వ్యవహారం బట్టి తెలుస్తుంది. అందుకే క్షత్రియులు విష్ణువు భుజములనుంచి వచ్చారు అంటారు. ఈ వాసనలతో క్షత్రియులు ఒక క్షేత్రం ఏర్పాటు చేసుకుని అందులో ధర్మాన్ని రక్షించే బాధ్యతను స్వీకరిస్తారు.

వైశ్యుడిగా ప్రసిద్ధికెక్కాలంటే బలమైన జ్ఞాన వాసనా, బలమైన లౌక్య వాసన ఉండాలి. ఇది పిల్లవాడి ఆలోచన, వ్యవహారం బట్టి తెలుస్తుంది. ఈ వాసనా బలంతో వారు వర్తక వాణిజ్యాలను పెంపొందించి పలువురికి జీవనోపాధి కలిపిస్తారు. వైశ్యులది పోటీ ప్రపంచం. అందుకే వారి వ్యవహారంలో కొంత గోప్యత కనబడుతుంది. అందుకే వైశ్యులు విష్ణువు యొక్క తొడలనుండి వచ్చారు అంటారు. తొడలు మన శరీరంలో అత్యంత రహస్యమైన ప్రదేశం కదా.

పిల్లవాడి వాసన బట్టి గురువులు అతనికి ఉపనయనం చేస్తారు. తద్వారా అతని వర్ణం మారిపోతుంది. అప్పటిదాకా శూద్రుడిగా ఉన్న బాలుడు బ్రాహ్మణుడిగానో, క్షత్రియుడిగానో, వైశ్యుడిగానో గురువుల దగ్గర శిక్షణ మొదలు పెడతాడు. వర్ణం మారింది కాబట్టి అక్కడి నుంచి రెండవ జన్మ మొదలైందని అర్ధం. అందుకే ద్విజుడు అనే పేరు వచ్చింది. ఇటువంటి వాసనా బలములు లేని పిల్లలు శూద్రులు గానే ఉండిపోతారు. వారికి ఓర్పు ఎక్కువ ఉంటుంది. కర్షకులుగా జీవనం గడుపుతారు. అందుకే విష్ణువు పాదములనుండి వచ్చారు అని అంటారు.

మనిషిలోని వాసన బలాన్ని ధర్మ సంస్థాపన మరియు పరిరక్షణ కొరకు వినియోగించడమే ఉపనయన ప్రక్రియ యొక్క ముఖ్యోద్దేశ్యం. అంతే తప్ప సంఘాన్ని విభజించి వివాదాలకు పునాదులు వేయడం కాదు. మనకు సహజంగా వచ్చిన ప్రతిభను గుర్తించి ఆ దిశలో శిక్షణ ఇప్పిస్తే మంచి సమర్థులుగా తీర్చిదిద్దబడతాము. అందుకే ఈ ఉపనయన ప్రక్రియ వచ్చింది.

దేవుని దృష్టిలో చాతుర్వర్ణాలలో ఎవ్వరూ తక్కువ కాదు. మోక్షపదంలో అందరికన్నా ముందుండేది శూద్రులే. ఎందుకంటే వారికి బలమైన వాసనలు లేవు, కనుక బలమైన అహంకారం ఉండదు. అందుకని చాలా సులువుగా అహాన్ని జయించి దేవుణ్ణి చేరుకో గలరు.

25 తత్వాలు

పంచభూతాలు - 1.గాలి 2.నీరు 3.నిప్పు, 4.భూమి 5.ఆకాశం - వీటితో సృష్టి చేయబడింది.

5 తన్మాత్రలు - 6. శబ్ద 7.స్పర్శ 8.రస 9.రూప 10.గంధము - పంచభూతాలకు జ్ఞానేంద్రియాలకు మధ్య సంబంధం. దీని గురించి పూర్తి వివరం పంచతన్మాత్ర సాయక అనే నామంలో ఉన్నది.

10 ఇంద్రియాలు - 11.కళ్ళు 12.ముక్కు 13.చెవులు 14.నాలుక 15.చర్మము (ఇవి జ్ఞానేంద్రియాలు) 16.చేతులు 17.కాళ్ళు 18.నోరు 19.మలద్వారం 20.మూత్రద్వారం (ఇవి కర్మేంద్రియాలు). ఇవి పంచభూతాలతో చేయబడ్డాయి.

21.మనస్సు - ఇది ఇంద్రియాలకు అధిపతి

22.బుద్ధి - ఇది మనస్సుకు అధిపతి

23.చిత్తం - ఇది బుద్ధిని ప్రభావితం చేయ గలదు.

24.అహంకారం - ఇది పైవాటినన్నిటినీ శాశించగలదు

25.మాయ - ఈ మాయ వలనే పైనవన్నీ పరబ్రహ్మానికి భిన్నంగా అనిపిస్తాయి.

అమ్మ వీటన్నిటిని ఆసనంగా చేసుకుని వాటి పైన కూర్చుంటుంది. అంటే ఆవిడే పరబ్రహ్మం. గాయత్రీ దేవి తత్వమయీ - అంటే నీవు కానిది, నీవు అయినది అంతా ఆవిడే

పంచకోశాంతరస్థితా

కోశము అంటే , వర అని అర్ధం.
మానవ శరీరంలో ఐదుకోశాలున్నాయి. అవే
1. అన్నమయకోశము, 2. ప్రాణమయకోశము, 3.ఆనందమయకోశము, 4.మనోమయకోశము, 5.విజ్ఞానమయకోశము
ఆనందమయకోశము మిగతా నాలుగుకోశాలనడుమ ఉంటుంది. అందులోనే పరబ్రహ్మ ఉంటాడు.

తైత్తిరీయోపనిషత్తులోని భృగుపల్లిలో వరుణ మహర్షికుమారుడు భృగుమహర్షి, విద్యాభ్యాసం పూర్తిచేసి బ్రహ్మజ్ఞానం సంపాదించాలనే కోరికతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి బ్రహ్మతత్త్వాన్ని ఉపదేశం చెయ్యమని అడిగాడు. దానికి తండ్రి "కుమారా ! అన్నము, ప్రాణము, నేత్రము, శోత్రము, మనస్సు, వాక్కు ఇవన్నీ పరబ్రహ్మ సాధనకు మార్గలే. వీటన్నింటిలోనూ బ్రహ్మతత్త్వం ఇమిడి ఉన్నది. అది దేనిలోనుంచి ఉత్పన్నమైనదో, దేనితో పోషింపబడుతున్నదో, దేనియందులయమవుతున్నదో అన్నిటికీ మూలవస్తువేదో తెలుసుకోవాలి. దాన్ని తపస్సు ద్వారానే సాధించాలి. కాబట్టి వెళ్ళి తపస్సు చెయ్యి" అన్నాడు. తండ్రి ఆదేశాన్ననుసరించి దీక్ష తీసుకుని నియమనిష్టలతో తపస్సు చెయ్యటం ప్రారంభించాడు భృగువు. కొంతకాలం గడిచింది. ఆ తరువాత అన్నమే పరబ్రహ్మ స్వరూపము అని తెలిసింది. అన్నం మూలంగానే అన్ని ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రాణులన్నీ అన్నంవల్లనే పోషింపబడుతున్నాయి. కాబట్టి అన్నమే పరబ్రహ్మ స్వరూపము. ఈ విషయం తన తండ్రికి చెప్పాడు. దానికి వరుణమహర్షి "నాయనా ! తత్త్వసాధనలో నువ్వు మొదటి మెట్టు మీదనే ఉన్నావు. ఇంకా సాధన చెయ్యి. అన్నం పరబ్రహ్మ స్వరూపమే. కాని అన్నమే పరబ్రహ్మ స్వరూపంకాదు. వెళ్ళి తపస్సు చెయ్యి" అన్నాడు. మళ్ళీ తపస్సు చెయ్యటం మొదలు పెట్టాడు భృగువు. కొంతకాలం గడిచింది. ప్రాణమే బ్రహ్మ అనే విషయాన్ని తెలుసుకున్నాడు. లోకంలోని సమస్త జీవరాశులు ప్రాణంవల్లనే జీవిస్తున్నాయి. ప్రాణం పోయినప్పుడు మృత్యువులో లయమవుతున్నాయి. అందుచేత ప్రాణమే సర్వ సృష్టికి మూలాధారం అని భావించాడు. అదే విషయం తండ్రికి చెప్పాడు.

నాయనా ! ఇదివరకటి కన్న కొంచెం ముందుకు వెళ్ళావు. అంతేకాని ప్రాణమే పరబ్రహ్మమ్ కాదు. మళ్ళీ తపస్సు చెయ్యి అన్నాడు వరుణమహర్షి. మళ్ళీ తపస్సు చెయ్యటం ఆరంభించాడు భృగువు. కొంతకాలం గడిచింది. మనస్సు వల్లనే ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి. స్త్రీ పురుషులు మనసుచేతనే ఆకర్షితులౌతున్నారు. అందువల్లనే ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. జన్మించిన తరువాత కూడా ఇంద్రియాల సాయం తోనే జీవనం సాగుతున్నది. చనిపోయిన తరువాత కూడా ఇంద్రియాలకు జ్ఞానం ప్రసాదించే శక్తిపోతుంది. ఇంద్రియాలన్నీ మనస్సులో లీనమవుతాయి. కాబట్టి మనస్సే బ్రహ్మ అనుకున్నాడు భృగువు. ఇదే విషయాన్ని తండ్రికి తెలియచేశాడు. కాదన్నాడు తండ్రి ఇంకా తపస్సు చెయ్యమన్నాడు. మళ్ళీ కొంతకాలం తపస్సు చేశాడు భృగువు. అప్పుడు అతడికి అర్ధమయింది - "విజ్ఞానమే బ్రహ్మ". వెళ్లి ఈ విషయాన్ని తండ్రికి చెప్పాడు. కాదన్నాడు తండ్రి. మళ్ళీ తపస్సు చెయ్యమన్నాడు. తండ్రి మాట ప్రకారం మళ్ళీ తపస్సు చేశాడు భృగువు. అప్పుడు తెలిసింది ఆనందమే బ్రహ్మ అని సర్వమూ ఆనందం నుంచే జనిస్తుంది. ఆనందంలోనే లయమవుతుంది. ఈ విషయం తండ్రికి తెలియచేశాడు. మహదానందం చెందాడు
వరుణ మహర్షి అప్పుడు చెప్పాడు. "కుమారా ! అన్నింటికన్నా ఉత్తమంగా పరమాత్మను వ్యక్తం చేసే తత్వం ఆనందం. అన్నము ప్రాణము, మనస్సు, విజ్ఞానము కూడా పరబ్రహ్మ రూపాలే. ఇవన్నీ ఒక దానికన్న మరొకటి సూక్ష్మమైనది. అన్నింటికీ మించినది ఆనందం. ఈ ఆనందం క్షణికమైనదికాదు. శాశ్వతమైనది. పరబ్రహ్మోపాసన క్రమంగా జరగాలి. ఆహారాన్ని వదలకుండా తింటూ ప్రాణాన్ని నిలుపుకుని, మనసును వికసింపచేసుకుని, దానివల్ల విజ్ఞానం పొంది తద్వారా బ్రహ్మ సాక్షాత్కారం పొందాలి" అన్నాడు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపము పంచకోశములందు ఉంటుంది.

మానవశరీరం మూడురకాలయిన దేహాలుగా విభజించబడుతుంది. అవి:1. స్థూలదేహము 2. సూక్ష్మ దేహము 3. కారణదేహము

1. స్థూలదేహము-అన్నమయ కోశము
2. సూక్ష్మదేహము -ప్రాణమయ, మనోమయ,విజ్ఞానమయకోశాలు
3. కారణదేహము -ఆనందమయకోశము

ఈ కోశాలు ఐదు ఒక దానిలో ఒకటి ఉంటాయి. అమ్మవారి బొమ్మ వేసినప్పుడు ఆమె చేతిలో ఐదుపూలు వేస్తారు. అవి పంచతన్మాత్రలు. కొన్నిచోట్ల ఆ పూలు విడివిడిగా కాకుండా ఒక దానిలో ఒకటిగా ఉంటాయి. అవి పంచకోశాలు.

1. అన్నమయకోశంలో ప్రాణమయకోశం ఉంటుంది.
2. ప్రాణమయకోశంలో మనోమయకోశముంటుంది.
3. మనోమయకోశంలో విజ్ఞానమయకోశముంటుంది.
4. విజ్ఞానమయకోశంలో ఆనందమయకోశముంటుంది.

ఆనందమయకోశంలో ఉండేవాడే పరబ్రహ్మ, అదే అమ్మ. ఆమె ఆనందమయకోశమందుంటుంది. అందుచేతనే పంచకోశాంతరస్థితా అనబడుతుంది.

నిస్సీమమహిమ

మనసు యొక్క యెల్లలను దాటినది. నిరవధికమైన హద్దులు లేని మహిమ గలది.అపారమైన ప్రభావము, అనంతమైన ప్రతిష్ఠగలది. ఆది మధ్యాంతరహితురాలు, సర్వవ్యాపి, పంచకృత్యపరాయణ అయిన ఆ పరమేశ్వరి మహిమలకు సీమలు లేవు.
నిత్యయోవనా

కాలోహి జగద్భాక్షకః అన్నారు. అంటే స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తు అంతా కాలంలో మార్పు చెందుతుంది. అంటే కాలంచే ప్రభావితమవుతుంది. కానీ అమ్మ కాలాతీతమైనది. కాలముచే ఆమె ప్రభావితం అవ్వదు.
మాదశాలినీ

ఆనందమయ విషయమే మదము. అమ్మ సదామహదానందం పొందుతూ ఉంటుంది కాబట్టి మదశాలినీ అనబడుతుంది. ఏ ఇతర భావావేశము చేతనూ కలవనటువంటి బ్రహ్మానందాన్ని పొందేటటువంటిది.
మదఘోరానితరక్తాక్షీ

ఆనందమయ విషయమే మదము. ఆ మదముచే తిరుగుచున్న ఎర్రని కనులు గలది. లోకసంబంధమైన విషయాలకు దూరంగా ఉండటమే ఘూర్ణము. పరమానందం పొందినప్పుడు, లౌకిక విషయాలన్నీ దూరమైపోతాయి.
మదపాటలగన్డభూ-చందనద్రవాదిగ్దాన్గి-చాంపేయకుసుమప్రియా

మదముచేత ఎరుపు తెలుపు కలిసిన రంగు గల చెక్కిళ్ళు గలది. మంచి గంధముచే పూయబడిన అంగములు గలది. అంటే పరమేశ్వరి శరీరమంతా చందనలేపనం కావించటం జరిగింది. కుంకుమ పూల రసముతో కలిపిన మంచి గంధము శరీరావయవములకు రాయబడినది. చాంపేయ పుష్పము అనగా - నాగకేసరపుష్పము. చంపకపుష్పము. సంపెంగపూవు, సంపెగపూలమీద పరమేశ్వరికి ప్రీతి ఎక్కువ.

కుశల కోమలాకార

సృష్ట్యాది నిర్మాణములందు నేర్పు గలది. కాబట్టి కుశలా అనబడుతుంది. భూతభవిష్యద్వర్తమాన కాలాలలో ఎప్పుడూ వృద్ధి క్షయాలు అనేవి లేనిది. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేది. క్షేమంగా ఉండేది. ఏ రకమైన వాంఛలు లేక తృప్తిగా ఉంటుంది. కాబట్టి కుశలా అనబడుతుంది. అన్ని విషయములందు అరితేరినది. అంటే పంచకృత్యాలయందు, సర్వవిధ విజ్ఞానమందు, చతుషష్టి కళలందు, అద్వితీయమైన నేర్పరి కాబట్టి కుశలా అనబడుతుంది.

కోమలము అంటే-మృదుత్వము. కాబట్టి కుసుమకోమలమైన ఆకారము గలది. ఒక్క దేవతలను, మానవులనే కాదు. క్రూరస్వభావులైన రాక్షసులను కూడా సమ్మోహింపచేయునది. సకల జన వశీకరణము చేయురూపము గలది.

కురుకుళ్ళా కులేశ్వరీ

కురుకుళ్ళా అనేది ఒక దేవత. శ్రీపురంలోని అహంకార చిత్తమయ ప్రాకారాల మధ్యలో విమర్శమయమైన బావి యందు ఉంటుంది.
లలితాస్తవ రత్నంలో

కురువిందతరుణినిలయాం కులాచలస్పర్థి కుచనమన్మధ్యాం

కుంకుమ విలిప్త గాత్రీం కురుకుళ్ళాం మనసి కుర్మహే సతతం ||

కురువిందరత్నములపై నివసించునది, కులపర్వతాలను మించిన కుచయుగములచే వంగిన నడుము గలది, కుంకుమలేపనము గావించబడిన దేహము గలది అయిన కురుకుళ్ళా దేవిని మనసున ధ్యానింతును. ఈ ప్రాకార అవరణలో ఆ దేవి పేరు శ్యామ. ఈమెనే కురుకుళ్ళాదేవి అంటారు. ఈ దేవతా స్వరూపంలోనే ఉంటుంది కాబట్టి లలితమ్మ కురుకుళ్ళా అనబడుతోంది.

సుషుమ్న మార్గంలో ముఖ్య నాడి కురుకుళ్ళా ఆనబడుతుంది. ఆధారచక్రం దగ్గర నుండి సహస్రారం దాకా, గ్రంథిత్రయముతో సహా ఈ ప్రాణి ఉంటుంది. అందుకే అది కురుకుళ్ళా అనబడుతుంది.

భావనోపనిషత్తులో

వారాహీ పితృరూపా, కురుకుళ్ళావళి దేవతా మాతా
శ్రీచక్రానికి ప్రధాన దేవత శ్రీదేవి. ఆమె శరీరం నుంచి వచ్చిన కాంతి పుంజాలు అష్టసిద్ధులైన అణిమాది దేవతలు. అలాగే సాదకుడి తండ్రి వారాహి. తల్లి కురుకుళ్ళావతి. ఇక్కడ మాతా అంటే సాధకుని కోరికలు తీర్చేది. ఐహికవాంఛలు తీర్చి మోక్షాన్ని ప్రసాదించేది.

మానవ శరీరంలో సుషుమ్నా నాడీమండలంలో ప్రాణనాడి అని చెప్పబడే సుషుమ్నా నాడినే 'కురుకుళ్ళా' అంటారు.
సుధాసింధువు మధ్యన మణిద్వీపమందున్న శ్రీదేవి పట్టణానికి చిత్తము - అహంకారము అనబడే రెండు ప్రాకారాల మధ్య విమర్శరూపమైన బావియందుండేది కురుకుళ్ళా దేవి అనే దేవత.

సజాతీయులైనటువంటి మాతృ మాన మేయముల సమూహము కులము అనబడుతుంది. అటువంటి వాటికి ఈశ్వరి, త్రిపుటికి ఈశ్వరి. కాబట్టి కులేశ్వరి. కురుకుళ్ళా అనే దేవత యే కులేశ్వరి అనబడుతుంది.

మూలాధారాదికం షట్చక్రం కుల మితి స్మృతం
మూలాధారము స్వాధిష్ఠానము మణిపూరము అనాహతము విశుద్ధిచక్రము ఆజ్ఞాచక్రము ఈ మార్గానికి కులమని పేరు. ఇదే సుషుమ్నా మార్గం. ఈ మార్గంలో సంచరించే ముఖ్యప్రాణ స్వరూపిణియే కురుకుళ్ళా దేవి. ఆమెయే కులేశ్వరి అనబడుతున్నది.

కులము అంటే నాడీమండలము. దీనికి ఈశ్వరి కాబట్టి కులేశ్వరి అనబడుతుంది. 84 లక్షల జీవరాశికి ఈశ్వరి కాబట్టి కులేశ్వరి అనబడుతుంది.

కులకుండాలయా

మూలాధారంలో కర్ణికమధ్యన ఉండే బిందువే కులకుండము. అతి సూక్ష్మంగా ఉంటుంది. అదే ఆ దేవి యొక్క స్థానము. అదే కుండలిని అనబడుతుంది. ఈ విషయాన్ని వివరిస్తూ శంకర భగవత్పాదులవారు తమ

సౌందర్య లహరిలోని పదవశ్లోకంలో

సుధాధారాసారై-శ్చరణయుగలాంత-ర్విగలితైః
ప్రపంచం సిన్ఞంతీ పునరపి రసామ్నాయ-మహసః|
అవాప్య స్వాం భూమిం భుజగనిభ-మధ్యుష్ట-వలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ‖ 10 ‖


తల్లీ ! నీ పాదయుగము నుండి స్రవించు సుధాధారలచే ప్రపంచాన్ని తడిపే అమృతానికి నిధానమై, కాంతులు వెదజల్లే చంద్రుని వదిలి, నీ స్వస్థానమైన ఆధరాచక్రాన్ని చేరి అక్కడ భుజంగాకారము దాల్చి తామరదుద్దు మధ్యలో ఉన్న సన్నని రంధ్రమువలె మిక్కిలి సూక్ష్మమైన పృథివీతత్త్వమందు కుండలినీశక్తివై నిద్రింతువు, గతంలో చెప్పినట్లుగా ఆధారచక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసినట్లై, అది గ్రంథిత్రయాన్ని ఛేదించి సహస్రారం చేరి సుధాధారలు కురిపించి, ఆ తరువాత మళ్ళీ ఆధారచక్రంచేరి నిద్రావస్థలోకి జారుకుంటుంది.

సుషుమ్నకు ఆధారమైన మూలాధారము నందుండు కుండలిని ఆలయంగా గలది. కాబట్టి కులకుండాలయా అనబడుతుంది.

చిదగ్నికుండమే కులకుండము. అదే బ్రహ్మము. ముఖ్యప్రాణస్వరూపిణి అయిన పరమేశ్వరి నిర్వికార చిన్మాత్ర. బ్రహ్మమే నివాసస్థానముగా గలది.

కౌళమార్గ తత్పరసేవితా

 వంశపారంపర్యంగా వచ్చిన మార్గము కులసంబంధమైనది. దానినే కౌళము అని పిలుస్తారు. వ్రతఖండము అనే గ్రంథంలో “ఎవరికి దేవి కులమార్గాన ఉన్నదో, వానిచేత ఆమె ధూపదీప నైవేద్యములచే పూజింపబడును" అని చెప్పబడింది. కులమార్గాన్ని అనుసరించి సంప్రదాయం ప్రకారము ఆమెకు వివిధరకాలయిన నైవేద్యములు సమర్పించటం జరుగుతుంది.

శ్రీ విద్యను ఉపాసించేవారు మూడు రకాలు అని గతంలో వివరించాం. వారు
1. సమయాచారులు - వైదిక సంప్రదాయాలు పాటిస్తారు
2 మిశ్రమాచారులు - కౌళ, సమయాచారాలను మిళితంచేసి అర్చన చేస్తారు
3. కౌళాచారులు - తంత్రశాస్త్రాల ఆధారంగా పరమేశ్వరి అర్చన చేస్తారు. ఈ కౌళాచారులచే కులమార్గంలో పూజించబడుతుంది. కౌలము - కులమార్గము - పారంపర్యంగా అర్చించబడేది.

వంశము అనేకరకాలు వాటిలో
1. జనకవంశము- తండ్రి, తాత, ముత్తాత, ఆపై వారు.
2. విద్యావంశము- గురువు, పరమగురువు, పరమేష్టి గురువు
3. వర్ణము -కులాచారం
4. సుషుమ్నామార్గం.
వీటివల్ల సంక్రమించే విద్య పారంపర్యవిద్య. ఈ సంప్రదాయంలో పరమేశ్వరిని కౌళమార్గంలో అర్చించటం జరుగుతుంది. అందుకే ఆమె కౌళమార్గ తత్పరసేవితా అనబడుతుంది.

కుమారగణానాదాంబా

కుమారుడు - కుమారస్వామి. గణనాధుడు గణపతి వీరిద్దరికీ తల్లి. మన్మధ వికారాలను తొలగించేది. అంటే భక్తుల యొక్క అహంకారము తొలగించి వారికి మోక్షమిస్తుంది ఆ పరమేశ్వరి.
తుష్టి - పుష్టి - మతి - ధృతి

తుష్టి అంటే - సంతోషము. సర్వభూతాలయందు తుష్టి రూపంలో ఉంటుంది. స్థూల శరీరమే కాకుండా సూక్ష్మ, కారణ శరీరములయందు కూడా ఆరోగ్య రూపంలో ఉంటుంది. జీవులయందు బుద్ధి రూపంలో ఉండి సంకల్ప వికల్పాలను చేస్తుంది కాబట్టి మతి అనబడుతుంది. మనస్సు యొక్క స్థిరమైన భావమే ధృతి అనబడుతుంది. మనసుకు కావలసిన ధైర్య స్థైర్యం కలిగిస్తుంది. సర్వభూతములందు ధృతిరూపంలో ఉండేది.
శాంతి - స్వస్తిమతి - కాంతి

శాంతి అనేది సత్వగుణ ప్రధానమైనది. అమ్మను గనక అర్చించినట్లైతే కామక్రోధలోభమోహ మదమాత్సర్యములనబడే అరిషడ్వర్గాలను నశింపచేసి, సాధకులకు శాంతిని కలిగిస్తుంది.సు అంటే బాగుగా, అస్తి అంటే ఉండటం. స్వస్తి అంటే మంచిగా ఉండటము. ఆవిడ మనందరికీ మంగళకారిణి. అందుకే స్వస్తిమతి అన్నారు. సకల ప్రపంచమందు కాంతిరూపంలో ఉన్నది. ప్రతిజీవిలోనూ జీవం రూపంలో ఉన్నది. ప్రతి జీవిలోనూ జీవకళనే తేజస్సు అంటారు. అదే కాంతి. జీవులయందు ఆ రకంగా తేజోమయరూపంలో ఉండేది కాబట్టి అమ్మ కాంతి అనబడుతోంది.

నందిని - విఘ్ననాశిని

ఆనందస్వరూపమైనది.
విఘ్నాలను నశింపచేసేది. అవిద్యను నశింపచేసేది.

తేజోవతీ

సూర్యుడు మొదలగు తేజోమూర్తులకు ఆధారభూతురాలు. ఆ పరమేశ్వరి నుండి అనేక వేలకోట్ల కిరణాలు ప్రసరిస్తున్నాయి. అందులో అగ్ని 108 కిరణములు సూర్యుడు 116 కిరణములు చంద్రుడు 136 కిరణములు వెరసి 360 కిరణములను గ్రహించగలిగారు. సూర్యుని ప్రకాశమువల్ల పగలు, చంద్రకాంతులవల్ల రాత్రి, అగ్ని కాంతులవల్ల సంధ్యవేళలయందు ఈ జగత్తులోని వ్యాపారాలన్నీ జరుగుతున్నాయి. అని గతంలో వివరించాం. అయితే ఈ కిరణాలన్నీ శ్రీచక్రంలోని నవావరణల నుంచే ప్రసరిస్తున్నాయి అని కూడా అంటున్నారు.

త్రికోణంలో      3x5= 15 కిరణములు
అష్టకోణంలో     8x1= 8 కిరణములు
అంతర్దశారంలో    10X2 =20 కిరణములు
బహిర్ధశారంలో      10X6 =60 కిరణములు
చతుర్దశారంలో.     14x4 =56కిరణములు
అష్టదళపద్మములో 8x8 =64 కిరణములు
షోడశదళపద్మములో    16 x7 =112 కిరణములు
భూపురంలో.       10X3 =30 కిరణములు

మొత్తం 365 కిరణములు

ఇవే సంవత్సరానికి రోజులు. లలితా సహస్రంలోని శ్లోకాల సంఖ్య 182 1/2 అంటే 365 పాదాలు. ఇవే కాంతి కిరణాలుగా భావించాలి అని చెప్పారు. అయితే వృత్తము లేక బిందువులో 360 కిరణాలు లేదా డిగ్రీలు ఉంటాయి. అంతేకాని 365 కాదు. అందుచేత ఈ లెక్క సరిగా అగుపించటం లేదు. అయినప్పటికీ వారి మతాన్ని కూడా ప్రతిపాదించాం. ఈ రకంగా కాంతిని ఇచ్చే వాటికి మూలాధారమైనది కాబట్టి తేజోవతీ అనబడుతుంది.

త్రినయనా

సోమసూర్యాగ్నులనబడే మూడు నేత్రాలు గలది. తేజోవంతమైన మూడు నేత్రాలు గలది. కుడికన్ను - సూర్యుడు. ఎడమకన్ను - చంద్రుడు. ఫాలనేత్రము - అగ్ని అలాగే కుడికన్ను పగలు, ఎడమకన్ను - రాత్రి. ఫాలనేత్రము సంధికాలము.

జ్ఞానాత్మనే - నేత్రత్రయాయ ఔషట్
జ్ఞానమే మూడునేత్రాలుగా గలది. ఈ నేత్రాలవల్ల కలిగేది కాలజ్ఞానము. అంటే తిథి, పక్షము, మాసము, ఋతువు, ఆయనము, సంవత్సరము.

శంకర భగవత్పాదులవారు తమ సౌందర్య లహరిలోని 48వ శ్లోకంలో
అహః సూతే సవ్య తవ నయన-మర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా |
తృతీయా తే దృష్టి-ర్దరదలిత-హేమాంబుజ-రుచిః
సమాధత్తే సంధ్యాం దివసర్-నిశయో-రంతరచరీమ్ ‖ 48 ‖


ఓ దేవీ ! నీ కుడికన్ను సూర్యాత్మకము పగలు, ఎడమకన్ను చంద్రాత్మకము రాత్రి. నీ మూడవ నేత్రము సంధ్యాకాలము సూచించుచున్నది.

లోలాక్షీ కామరూపిణీ

చలిస్తున్న కనులు గలది. మహా కామేశ్వరుని రూపం కలది కాబట్టి కామరూపిణి.
మాలిని - హంసిని - మాత - మలయాచలవాసిని
మాల గలది కాబట్టి మాలిని. అది మాతృకా రూపంలో ఉన్న అక్షర మాల. హ కారము ఉచ్ఛ్వాస. సకారము నిశ్వాస. ఈ శ్వాస మీద అదుపు సంపాదించ గలిగినవాడు పరమహంస అనబడతాడు. అటువంటి పరమహంసలు చుట్టూ ఉంటారు. అంటే అమ్మనే తలచుకుంటూ ఉంటారు. అమ్మ మలయ పర్వతం మీద నివసించునది. మలబారు దేశంలో చందనవనంలో భగవతీనామంతో పూజించబడే దేవి. ఈమెనే మలయాల భగవతి అంటారు. మలయ పర్వతం అంటే మలేషియా.

సుముఖి - నళినీ - సుభ్రూహ్ - శోభనా - సురనాయికా

అమ్మ బ్రహ్మానందస్వరూపిణి కాబట్టి ఆమె ముఖపద్మము సర్వకాల సర్వావస్థలయందు ప్రకాశిస్తూ ఉంటుంది. తామర రేకులవంటి కనులు, తామరతూడులవంటి చేతులు, తామర పద్మములవంటి పాదాలు కలది. అంటే అంతటి మృదుత్వం, కోమలత్వం కలది.మంగళకరమైన కనుబొమలు గలది. సుభప్రదమైన మన్మథుని ధనుస్సువలె ఉన్న కనుబొమలు కలది. మహిషాసురుని సంహరించటం కోసం దేవతలందరూ వారి తేజస్సును బయటకి తీశారు. ఆ తేజస్సులోంచి ఒక సుందరమైన స్త్రీ రూపము ఉద్భవించింది. ఈ కారణాలచేతనే శోభనా అనబడుతుంది. అందరి దేవతల శక్తి ఆమెలోనే ఉన్నది. అందుకే ఆవిడ సకల దేవతాశక్తి సమైక్యురాలు.

కాలకంఠి - కాంతిమతి - క్షోభిణీ - సూక్ష్మరూపిణి

శివుడికి కాలకంఠుడు పేరు ఉంది. అమ్మ ఆయని భార్య కాబట్టి కాలకంఠి అన్నారు. కాంతి కలది. కాంతియుతములైన, తేజోవంతమైన సకలావయవములు గలది. పరమేశ్వరుడికి సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగేటట్లు చేసింది. సృష్టికాలంలో నిర్గుణుడైన పరబ్రహ్మలో ప్రవేశించి, చాంచల్యము కలిగించి సృష్టి చెయ్యాలనే కోరిక అతనికి కలిగించింది. ఇంద్రియాల తెలుసుకొనుటకు సాధ్య పడనిది. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలను సూక్ష్మదేహమంటారు.

Comments

Popular posts from this blog

Preface

Four elements of cognizance

Prayer